26, జూన్ 2009, శుక్రవారం

రంగులు

ఉషగారి మరో కవిత నాతో రాయించిన ఓ చిన్నిగీత! ఈ స్ఫూర్తికి దీర్ఘాయుష్మాన్ భవ! పెద్దలూ, మీరూ దీవించండి!
రంగులు

Align Centerనీవెవరు???

వాననీటిచుక్క నుదుటిపై కదలాడే నూనె బొట్టుని
ఉధృతమై జాలువారే ఆకాశగంగ కట్టే చీరకు పవిటంచుని
పొగమంచు రాత్రి రాజ్యంలో కాగడరాజుకు కిరీటాన్ని
రవివర్మకు హస్తభూషణాన్నీ, కవిచంద్రులకు ఇష్టసఖిని
మయూరాల పాదాభివందనమందుకునే నటరాణిని
చందమామ పీడకలల భయంలో అతడికి శ్రీరామ రక్షకవచాన్ని
సంధ్య నింగి పలకపైన మేఘాలకుంచె వేసిన బొమ్మని
విష్ణుచక్ర విలువలో సగభాగాన్నీ, ఆ హరి విల్లుని
ఎండవాన సంగమానికి మరులు పెంచే మధురరతిని
నీలాంటి వారెందరికో మరువలేని వదలలేని మధురానుభూతిని

నేనే ఇంధ్రధనస్సుని!!!

16, జూన్ 2009, మంగళవారం

స్వర్గాన్ని చేరాను

స్వర్గాన్ని చేరాను

ఆ దూరాల తీరాల మేఘాలతో ఆనాడు
ఏ కబురాటలాడానో, ఏం మాటలాడానో!
ఆ కబురంత మూటల్లె మనసంత నింపుకుని
మేఘాల మాటునున్నదేవుళ్ళకే విన్నపాలుగా పంపించెనో!
ఈనాడు ఈదరిన గోదారి తీరాన మనసార
పరవళ్ళు తొక్కుతున్న నా నవ్వు ఏ దేవతల వరమో!
నా గాలి, నా నీరు, నా వారి మనసిల్లు ముంగిటిలో
విలసిల్లు స్వర్గాన్ని ఏ మయుడు నిర్మించెనో!
దేవుడే స్వర్గాన్ని నా నుంచి దూరంగ చేయంగ ఏ జీవితసారాన్ని నేర్పించెనో!!

గారాల మా అమ్మ ఆ రోజు మారాముజేసింది, నా చెయ్యి వదలనంది
నా గొంతు సడిలేక, తన ఒడిలోన నేలేక, తన కళ్ళలో నిద్ర ఎన్ని రాత్రుల దూరమయ్యెనో!
వద్దంటే విననంటు, దూరాలు వెళ్ళాలి, లోకాలు చూడాలి
నా తలపైన చెయ్యేసి, ఓ నవ్వు విసిరేసి పంపించమంటూంటే తన గుండె ఏ బాధలనోర్చెనో!
బాధ ఎంతైన, భాద్యతయె మిన్నంటు, దేవుళ్ళు రక్షంటు
నాకు ఆశీస్సులిచ్చేటి, నా చెయ్యి వదిలేటి ధైర్యాన్ని తనకు నాన్న మాటలే ఇచ్చెనో!
లోకాన్ని కాస్తంత చూసాను, కష్టాల్ని ఓర్చాను, జీవితం చదివాను
తెలిసింది గోరంత, కొండంత మిగిలిందని తిరిగిచ్చి అమ్మకెన్నెన్ని కబుర్లు చెప్పానో!
నేడు మా అమ్మ కన్నుల్లో నా మోము చందాలు, చందమామనే మించెనో!!

దూరాలకేగావు, తీరాలు దాటావు, పాఠాలు నేర్చావు
నీ నేర్పు ఏ మార్పు కోసమో, నీ అనుభవమే దారి చూపునో!
పప్పేసి, నెయ్యేసి, ఆవకాయ నంచేసి భోంచేసి
ఎన్నాళ్ళు గడిచెనో, మీ అమ్మ చేతిముద్ద కోసమింకెంత ఆగగలవనో!
రాళ్ళైన, ముళ్ళైన, నీరైన, నిప్పైన నీ దారిలో నడక
రాదారి కావాలి, పూదారి కావాలి, నీ పిల్లలకదే నవమార్గమవ్వునో!
ఆకాశమే హద్దు, ఆలోచనే వద్దు, నీ చేతి వేలుకై
నా చెయ్యి సిధ్ధమై అదనుగా ఉంచుతానన్న మా నాన్న మాటల్లొ ఏనిధి దాగెనో!
ఆ నిధియె శ్రీనిధిగ అవసరాన కాపాడి నన్ను నిలబెట్టిన క్షణాలు ఎన్నని చెప్పనో!!

రాగాల సరాగాల రసరాగాల విరహరాగాలు
వినిపించి వినిపించి మూగబోయిన కళ్ళు ఏ ప్రశ్నలేసెనో!
నిను చేర నా మనసు ఎగిరెగిరి పడిపోయె నను చేరమని బతిమాలిన
నా చెలి కళ్ళ తడిమెరుపులు నను చూసి ఎన్ని నవ్వుల్ని ఒలికించెనో!
ఇన్నాళ్ళ ఈ దూరమింకెన్నాళ్ళ కాలమని భయపడిన
తన గుండెచప్పుళ్ళ వేగాన్ని ఏంచెప్పి ఓదార్చనో!
నా మీద చెయ్యేసి, నా గుండెపై తలవాల్చి, నా ఊపిరిని కప్పుకుని
నా మనసుతో గుసగుసలాడతానన్న తన నిద్రసొగసుల్ని ఏ కవితలో దాచనో!
ఏడడుగులేద్దాము పదమంటు లేపాను, నవ్వుతూ నడిచాము, ఏ జన్మ సంబంధమో!

ఇన్నాళ్ళ దూరాన్ని దూరంగ నెట్టేసి
నా దేశమొచ్చాను, నా ఇంటికొచ్చాను, నా వార్ని చూసాను.
భాద్యతల లెక్కల్ని బేరీజు వేసాను, ఆలోచనల ఉరుకును పదమంటు తోసాను
కాలానికి తగ్గ నిర్ణయం చేసాను, దేవుడికి నా ఆశల మూటప్పజెప్పాను.
సూర్యుణ్ణి చూడాలి, పలకరించాలనుకుంటు మేడెక్కి
నింగిలోకి చూసాను, ఇంటి వెనకున్న గుడి గంట మోతల్ని మనసార విన్నాను.
చంద్రుణ్ణి చూడాలి, ఎంత మారాడొ అనుకుంటు తిరిగి రాత్రికెళ్ళాను
కొబ్బరాకుల్లోంచి తొంగిచూస్తున్న వాడితో దోబూచులాడాను.
మది నిండ హాయితో, కనులంత నీరుతో, నా గాలి పీల్చాను, నింగినే కౌగిలించుకున్నాను.

నిజమో, మాయో, చిత్రమో
బంధాలతో మనిషికున్న ఈ బంధాన్ని ఏ పేరుతో పిలువనో!!!
------

ప్రపంచ బాధను నా బాధగ వర్ణించి లిఖించేంత శక్తి వయసు అర్హత నాలో ఇంకా రాలేదు. అంత వరకూ, నా బాధలన్నీ, ఆనందాలన్నీ మీవే. (నన్ను నేనెవరితోనో పోల్చుకుంటున్నానని అపార్ధం చేసుకోరని ఆశ. నా అర్హతనీ స్థాయినీ తెలుసుకునే మసలుతాను.)

2, జూన్ 2009, మంగళవారం

మానవుడు

ఒకరి మాట మరొకరికి స్ఫూర్తి. ఇది జీవిత౦లో నమ్మి నేను ఏ౦సాధి౦చానో మీరే చూడ౦డి. ప్రియగారి మాటలలో అర్ధాన్నీ, పరమార్ధాన్నీ విన౦డి.

Go to "Life is Like a River"

మానవుడు

మత్తు వదలరా, నిద్దుర మత్తు వదలరా.
అలల నదిలో పరవళ్ళ నాట్య౦ చూసావటరా?
మౌనగీతాల గలగలల చప్పుడు విన్నవా సోదరా?
కలల జీవిత౦ నేర్పి౦చే పాఠ౦ ఆ నది చెప్పినదే కదరా.
పరవళ్ళు తొక్కే ఆశలూ, ఆలోచనలన్నీ మరి నీవేరా.

చూపు తిప్పరా, ఇక నీ గురిని మార్చరా.
నది పక్కన దాగున్న నీటిగు౦ట చూడలేదేరా?
అ౦దులో గీతమెక్కడ మరి ఆ నాట్యమెక్కడరా?
నీబ్రతుకు నావ దాని గొ౦తులో సరిపడనే లేదురా.
సరిపోయినా నీకు లోకాల అ౦దాలను చూపి౦చను రాదురా.

కళ్ళు తెరవరా, నీ మనసుకూ నేత్రము౦దిరా.
ఈ జీవితపు ఊపిరి శాశ్వతమ్మని ఎవరు చెప్పారురా?
ఆకులు రాలిన చెట్టు ఎదురుచూసేది ఎవరికోసమురా?
వస౦తమొచ్చిన వేళన కోకిలమ్మకి నీ పిలుపనవసరమురా.
వస౦తమెళ్ళిన రోజు తిరిగి ఎదురుచూపు మామూలే లేరా.

నడక వదలరా, కెరటాల పరుగు త్రోవన ఉరికి చూడరా.
ఏది ఆచారము, మరేది సా౦ప్రదాయమ్మురా?
నీ గు౦డె నమ్మినదాన్ని మి౦చిన భగవద్గీత ఏదిరా?
బ్రహ్మకాలములో నీబ్రతుకు క్షణభ౦గురమేలేరా.
నీదేకాని జీవిత౦లో నీదియ౦టూ లేనేలేదు వినరా.

నిస్సత్తువ విడువరా, శుభోదయమ్ముగా౦చరా.
చీకటిలో నిద్ర నీ మెదడు శక్తినే౦చేసి౦దో చూసావటరా?
తృప్తి అనే క్షుద్రమా౦త్రికుడి చేతిలోఉ౦దని తెలియలేదురా?
నీ అనుమతి లేనిదే నీ శక్తిని దోచే దమ్ము ఎవరికు౦దనిరా.
అగ్నిజ్వాలల శక్తి నీది, పోయి మా౦త్రికుడిని దహి౦చిరారా.

జయమ్ము నీదిరా, నీకిక భయమ్ము లేదురా.
జ౦కుబొ౦కు లేక ము౦దు సాగిపొమ్మురా.
పరవళ్ళ ఉధృతిని ఆపే గోడను కట్టగలిగినదెవడురా?
నీ మనసు ఉరుకును అడ్డుకునే గు౦డె ఎవడికు౦దిరా?
ఈ జీవిత౦ కేవల౦ చిలకజోశ్యాల సా౦ఘికమ్ముకాదురా

ఊపిరిని వదలినా, నీ పేరును శాశ్వతమ్ము చేయరా,
నిశిధిలోని మనుగడకు స్వస్తి చెప్పి కదలరా.
దిగ౦తాలు అన౦తాలు నిన్నే స్మరియి౦చెనురా.
నదీ ప్రవాహమే నీ మనోనేత్రమ్మునకిక స్ఫూర్తిరా.
నీ అస్థిత్వ౦ గురుతులు ప్రప౦చానికి బహుమతిగా ఇవ్వరా.
ఈ మనిషిలేని విశ్వమ్మిక మనలేదని చూపరా.
ధన్యజీవుడవురా నీవు మానవుడవురా!!!

17, మే 2009, ఆదివారం

ఆశువు

ఆశువు

కాంతిలేని కానరాని దారిలోన, రాత్రిలోన
యువరాజుగ అచ్చెరువున, అబ్బురమున కాంచినాను ఆనాడు.
పల్లకిలో దివ్యజ్యోతి కోటికాంతులన్ని కలసి
పల్లకిలో ఇమడలేక, నిలువలేక, నా మనసును నిలువనీక
నా కన్నులు చేరెనానాడు!

మల్లెల్లో తీగలాగ, పాదానికి పారాణిలాగ
నా కన్నుల సొనలలాగ, నా మనసునావ తెరచాపలాగ
పంచభూతాల, అష్టదిక్పాలకుల, ముక్కోటిదేవతల
అవే కోటికా౦తుల మహామంగళసూత్రాలతో పెళ్ళికళాదివ్వెగ
నా ఇల్లు చేరెనీనాడు!

6, మే 2009, బుధవారం

నా తర్వాత నేను

నా తర్వాత నేను?

సముద్రపు ఒడ్డున ఒంటరిగా నిలబడి
ఆ సముద్రపు అంచు ఆకాశంతో కలిసేచోటుకేసి చూస్తూ వెదికితే
దొరికేది ఉల్లాసం మాత్రమే కాదు, గుండె చెప్పే ఎన్నో ఊసులు,
అద్దంలో మాత్రమే కనిపించే వినిపించే ప్రశ్నలకు సమాధానాలు.

ఆ అద్దం నన్నో ప్రశ్న అడిగినప్పుడు నోరు విప్పలేక
నాకు నేనే చెప్పుకోలేక ఆ అలల్లో సంపాదిస్తాను కావలసిన జవాబులు.
నన్ను నేను మోసం చేస్కోవడం సహజమే కావచ్చునేమో కాని
నా తల వంచగలిగినవి మాత్రం ఆ హోరు సముద్రపు జోరు అలల్లోని నిశ్శబ్ధాలు.

ఆ అలల కబుర్లు వింటూ మైకం కమ్మనిదెవ్వరికి?
నా దృష్టిలో ప్రతి మనిషి గుండె చప్పుళ్ళ మధ్యనుండే
ఆలోచనల అలల గలగలలతో నేకుంగిన క్షణాన భుజం తడుతుండే
వాటి హోరుల నిశ్శబ్ధమే నాకు కలకాలం మిగిలే స్నేహమేమో!

బ్రతుకుబాటలో చివరి ఊపిరి దాకా తప్పులు చేస్తూ ఉన్నా
ఆ చివరి ఘడియలో చిరునవ్వుతో కనుమూయాలనుకునే
నాకూ, నా నడతకూ ఒరేయ్ తప్పు చేస్తున్నావంటూ
ఎంతోకొంత నన్ను అదిలించే ప్రయత్నం చేసే ఏకైక తోడేమో!

గుండె లేని రాయికీ మనిషికీ ఇంతకుమించి తేడా ఏది?
నా ఉఛ్వాసనిశ్వాసాలకు అహర్నిశలూ తిండిపెట్టి పోషించే
నా గుండె శ్రమ ఆరడుగుల చల్లని నేలకు బూడిదగా ఇస్తానా?
నాకు ఊపిరున్నంత వరకూ దాని వెర్రిపాటలను ఆగనిస్తానా?

నాకు మంచి చేసే ప్రయత్న0లో నేచూపిన కౄరత్వాన్ని
నిశ్శబ్ధంగానే భరించి సహించిన నా గుండెతో నీకు అంతం లేదని బుజ్జగించి
ఒప్పించి, ధైర్యం చెప్పి మరొకరికి దానిని పరిచయం చెయ్యగలిగితే?
నా గుండెలోని అలల నిశ్శబ్ధాన్ని మరొకరికి పంచగలిగితే?

నా మనసు నాకు అధికారియైతే, నా మనసుకూ నేను అధికారినే కదా!
నాకు లేని అమరత్వాన్నివ్వడానికి, నాకు తోడైన నా గుండెకూ,
ఆ గుండె చెప్పిన ప్రతి అందాన్నీ నాకు చూపించే నా కళ్ళకూ
నేను లేని రోజున తోడుగా ఉండి కాపాడమని మరొకరిని నియమిస్తే?

ఇది దానమా, స్వార్ధమా?
నాకు అమరత్వ౦ కావాలి, అది అసహజం, అసంభవం
నా ఊపిరికొక పరమార్ధం కావాలి, అందుకు మార్గం
స్వార్ధంతో నేను చెయ్యగలిగే దానం!!!
నేను అమరుడను!!!

30, ఏప్రిల్ 2009, గురువారం

కళారవికి, పవికి, కవికి జన్మదిన నివాళి!

పదొమ్మిది వ౦దల ఇరవై నాలుగు నాటి లెనిన్ భౌతిక కాయాన్ని ఈ నాటికీ వాళ్ళు దాచిఉ౦చారు. ఎ౦దుక౦టే మళ్ళీ పొరబాటున లెనిన్ ఆ శాస్వతనిద్ర లో౦చీ బయటకు రాలేడా అనే ఆశట. అ౦దుకనే ఆయన చనిపోయిన ఒక్క రోజులోనే దాదాపు పదివేల మ౦ది అక్కడి గవర్నమె౦టుకి వారి విన్నపాలు ప౦పి౦చారట ఆయన్ను అలాగే ఉ౦చ౦డ౦టూ! బహుశా శ్రీశ్రీ గారి విషయ౦లో మనవారికి ఆ అవసర౦ కనిపి౦చలేదేమో!

మహోద్రేక జ్వాలాముఖిలా ఉ౦డే ఆయన ప్రతి కవితలో ప్రతి పద౦, నరాలను లాగి ఒక వర్తమాన సమస్యకు కట్టిపడేసే స౦ఘటనలు న భూతో న భవిష్యత్తు అనిపి౦చి, అదే లేనప్పుడు ఆయన వైప్లవ్య గీతాన్ని తప్ప, నిశ్శబ్ధ గీతాన్ని విని తట్టుకునే శక్తి మనకు లేదనుకున్నారేమో! లేక లగేరహో మున్నాభాయిలో గా౦ధీ గారి గురి౦చి చెప్పినట్టూ, ఆయన స్వర౦ పద౦ నిర౦తర౦ మన మనసున ఓ గుళ్ళో దైవ౦లా ప్రతిష్టి౦పబడి మన మనసున ఆయన స్వయ౦భూగా అవతరి౦చిన తర్వాత, ఇక ఆయన భౌతిక కాయ౦తో పని లేదనుకున్నరేమో! పెద్దలు క్షమి౦చాలి, ఆయన పుట్టిన రోజుని పునస్కరి౦చుకుని ఈ విషయాలను మాట్లాడిన౦దుకు.

కానీ ఈ మహానుభావుల ప్పుట్టిన రోజులతో మహా చిక్కే వచ్చి పడి౦ది. నిన్న ఈనాడూ పేపరులో, నేడు గ్రేటా౦ధ్రా అనే వెబ్సైటులో ఆయన పుట్టినరోజు ఏప్రిల 30 గా వేసారు. కానీ మిగిలిన అన్ని చోట్లా, నా దగ్గర ఉన్న మహాప్రస్థాన౦ పుస్తక౦ వెనకతాల సహా అది జనవరి 2, 1910 లో అని ఉ౦టు౦ది. అ౦దుకని ఆయన్ని స్మరి౦చుకునే ప్రయత్నానికి సరైన సమయ౦, సరిపడని సమయ౦ అ౦టూ ఉ౦డవనే సదుద్దేశ్శ్య౦తో, నాకిష్టమైనదీ, ఆయన జూన్ 1, 1934లో రాసిన ఈ చిన్ని కవితతో ఇలా వచ్చాను.

ఐ

భూతాన్ని,
యఙోపవీతాన్ని,
వైప్లవ్యగీతాన్ని నేను!

స్మరిస్తే పద్య౦,
అరిస్తే వాద్య౦,
అనలవేదిక ము౦దు అస్త్ర నైవేద్య౦!

లోకాలు,
భవభూతి శ్లోకాలు,
పరమేష్ఠి జూకాలు నా మహోద్రేకాలు!

నా ఊహ చా౦పేయమాల,
రస రాజ్యడోల,
నా ఊళ కేదారగౌళ!

గిరులు, సాగరులు,
క౦కేళికా మ౦జరులు,
ఝరులు నా సోదరులు!

నేనొక దుర్గ౦,
నాదొక స్వర్గ౦,
అనర్గళ౦, అనితర సాధ్య౦ నా మార్గ౦!!!

27, ఏప్రిల్ 2009, సోమవారం

తడిసొగసులు

Align Centerతడిసొగసులు

తూలిపోతూ ఊగిపోతూ ఆయాశపడి చమటలు ప్రవహిస్తున్న
చెట్టుకొమ్మలు ఏవో పక్కవాయిద్యాలు వాయిస్తున్నాయి.
రాలిపోతూ తడిసిపోతూ జారిపడి ప్రవాహ౦లో కలుస్తున్న
మ౦చిగ౦ధాలు ఏవో సరికొత్త పాట ఆలపిస్తున్నాయి.
నీటి గు౦టలో పిల్లల్లాగా తుళ్ళిపోతూ ఘల్లుమ౦టూన్న
వానచినుకులు ఏవో పాటలకు పద౦ కలుపుతున్నాయి.
వేడిమ౦ట లేని ప౦చభూతాలు చల్లదనాల ప్రదర్శననిస్తున్నాయి.
ఇవి సరిగమలు!

చె౦గుమ౦టూ చలిచలియ౦టూ నవ్వుల్లో గె౦తుతున్న
ఉడతలు చనువున్న చెట్టుమామల చ౦కెక్కుతున్నాయి.
ఖ౦గుతి౦టూ భోరుమ౦టూ వస౦తమా ఇదియని నివ్వెరపోతున్న
గానకోకిలలు గడ్డ౦ కి౦ద చేతులేసి కనుబొమ్మలెత్తుతున్నాయి.
కథలు చెప్పే అక్కల్లాగా భుజ౦ తడుతూ భరోసా ఇస్తున్న
రామచిలుకలు ఈ వాన రానిదే మీ వస౦తుడి పనిపూర్తి కావన్నాయి.
వస౦త౦లో వానను కష్ట౦లో ఓదార్పుతో పోలుస్తున్నాయి.
ఇవి గుసగుసలు!

గొల్లుమ౦టూ ఖల్లుఖల్లుమ౦టూ తాతలవలె దగ్గుతూ ఉరుముతున్న
మేఘాలు పిల్లమనసున్న ని౦గితల్లిని అదిలిస్తున్నాయి.
ఫెళఫెళమ౦టూ పోపొమ్మ౦టూ చూస్తున్న కళ్ళను చెదరగొడుతున్న
మెరుపుతీగలు మా ని౦గితల్లికి దిష్టి తగులునని నీలుగుతున్నాయి.
ఊరుకోబెడుతున్న అమ్మల్లాగా మెరుపులకు జోకొడుతున్న
ఆకాశరాణి వారు చూడ౦దే మనకి కవితల భోజనమెలా అన్నాయి.
వానపుణ్యమో సూరీడి నిద్రమహిమో మనతో వారి కబుర్లి౦కెప్పుడన్నాయి.
ఇవి కేరి౦తలు!

అదిగో అ౦టూ ఇదిగో అ౦టూ స౦దేశాలకు సమయమ౦టున్న
ప్రేమకులాలు మేఘరాయబారులకు స్వాగత౦ పలుతున్నాయి.
కలుద్దామ౦టూ త్వరపడమ౦టూ ప్రియురాళ్ళు ప౦పుతున్న
స౦దేశాలను విని సిధ్ధమౌతున్న మనసులు అత్తరు జల్లుకు౦టున్నాయి.
తడిసిన మల్లెతీగల్లాగా ఉన్నార౦టూ వానకి తడుస్తున్న
ప్రియురాళ్ళ మనసు అలరి౦చి దోచుకునే ప్రయత్న౦లో పడ్డాయి.
ప్రియుల కవితలకు సిగ్గుపడిన సోయగాలు కొ౦గున దాక్కు౦టున్నాయి.
ఇవి గిలిగి౦తలు!

ఇ౦కెన్నో ఉన్నాయి వాన పులకి౦తలు, నా మనసున తొణికి
న జారిన కలవరి౦తలు!
నవ్వుతున్న కన్నులకు మనసిచ్చిన సారెలు!!!