స్వర్గాన్ని చేరాను
ఆ దూరాల తీరాల మేఘాలతో ఆనాడు
ఏ కబురాటలాడానో, ఏం మాటలాడానో!
ఆ కబురంత మూటల్లె మనసంత నింపుకుని
మేఘాల మాటునున్నదేవుళ్ళకే విన్నపాలుగా పంపించెనో!
ఈనాడు ఈదరిన గోదారి తీరాన మనసార
పరవళ్ళు తొక్కుతున్న నా నవ్వు ఏ దేవతల వరమో!
నా గాలి, నా నీరు, నా వారి మనసిల్లు ముంగిటిలో
విలసిల్లు స్వర్గాన్ని ఏ మయుడు నిర్మించెనో!
దేవుడే స్వర్గాన్ని నా నుంచి దూరంగ చేయంగ ఏ జీవితసారాన్ని నేర్పించెనో!!
గారాల మా అమ్మ ఆ రోజు మారాముజేసింది, నా చెయ్యి వదలనంది
నా గొంతు సడిలేక, తన ఒడిలోన నేలేక, తన కళ్ళలో నిద్ర ఎన్ని రాత్రుల దూరమయ్యెనో!
వద్దంటే విననంటు, దూరాలు వెళ్ళాలి, లోకాలు చూడాలి
నా తలపైన చెయ్యేసి, ఓ నవ్వు విసిరేసి పంపించమంటూంటే తన గుండె ఏ బాధలనోర్చెనో!
బాధ ఎంతైన, భాద్యతయె మిన్నంటు, దేవుళ్ళు రక్షంటు
నాకు ఆశీస్సులిచ్చేటి, నా చెయ్యి వదిలేటి ధైర్యాన్ని తనకు నాన్న మాటలే ఇచ్చెనో!
లోకాన్ని కాస్తంత చూసాను, కష్టాల్ని ఓర్చాను, జీవితం చదివాను
తెలిసింది గోరంత, కొండంత మిగిలిందని తిరిగిచ్చి అమ్మకెన్నెన్ని కబుర్లు చెప్పానో!
నేడు మా అమ్మ కన్నుల్లో నా మోము చందాలు, చందమామనే మించెనో!!
దూరాలకేగావు, తీరాలు దాటావు, పాఠాలు నేర్చావు
నీ నేర్పు ఏ మార్పు కోసమో, నీ అనుభవమే దారి చూపునో!
పప్పేసి, నెయ్యేసి, ఆవకాయ నంచేసి భోంచేసి
ఎన్నాళ్ళు గడిచెనో, మీ అమ్మ చేతిముద్ద కోసమింకెంత ఆగగలవనో!
రాళ్ళైన, ముళ్ళైన, నీరైన, నిప్పైన నీ దారిలో నడక
రాదారి కావాలి, పూదారి కావాలి, నీ పిల్లలకదే నవమార్గమవ్వునో!
ఆకాశమే హద్దు, ఆలోచనే వద్దు, నీ చేతి వేలుకై
నా చెయ్యి సిధ్ధమై అదనుగా ఉంచుతానన్న మా నాన్న మాటల్లొ ఏనిధి దాగెనో!
ఆ నిధియె శ్రీనిధిగ అవసరాన కాపాడి నన్ను నిలబెట్టిన క్షణాలు ఎన్నని చెప్పనో!!
రాగాల సరాగాల రసరాగాల విరహరాగాలు
వినిపించి వినిపించి మూగబోయిన కళ్ళు ఏ ప్రశ్నలేసెనో!
నిను చేర నా మనసు ఎగిరెగిరి పడిపోయె నను చేరమని బతిమాలిన
నా చెలి కళ్ళ తడిమెరుపులు నను చూసి ఎన్ని నవ్వుల్ని ఒలికించెనో!
ఇన్నాళ్ళ ఈ దూరమింకెన్నాళ్ళ కాలమని భయపడిన
తన గుండెచప్పుళ్ళ వేగాన్ని ఏంచెప్పి ఓదార్చనో!
నా మీద చెయ్యేసి, నా గుండెపై తలవాల్చి, నా ఊపిరిని కప్పుకుని
నా మనసుతో గుసగుసలాడతానన్న తన నిద్రసొగసుల్ని ఏ కవితలో దాచనో!
ఏడడుగులేద్దాము పదమంటు లేపాను, నవ్వుతూ నడిచాము, ఏ జన్మ సంబంధమో!
ఇన్నాళ్ళ దూరాన్ని దూరంగ నెట్టేసి
నా దేశమొచ్చాను, నా ఇంటికొచ్చాను, నా వార్ని చూసాను.
భాద్యతల లెక్కల్ని బేరీజు వేసాను, ఆలోచనల ఉరుకును పదమంటు తోసాను
కాలానికి తగ్గ నిర్ణయం చేసాను, దేవుడికి నా ఆశల మూటప్పజెప్పాను.
సూర్యుణ్ణి చూడాలి, పలకరించాలనుకుంటు మేడెక్కి
నింగిలోకి చూసాను, ఇంటి వెనకున్న గుడి గంట మోతల్ని మనసార విన్నాను.
చంద్రుణ్ణి చూడాలి, ఎంత మారాడొ అనుకుంటు తిరిగి రాత్రికెళ్ళాను
కొబ్బరాకుల్లోంచి తొంగిచూస్తున్న వాడితో దోబూచులాడాను.
మది నిండ హాయితో, కనులంత నీరుతో, నా గాలి పీల్చాను, నింగినే కౌగిలించుకున్నాను.
నిజమో, మాయో, చిత్రమో
బంధాలతో మనిషికున్న ఈ బంధాన్ని ఏ పేరుతో పిలువనో!!!
------
ప్రపంచ బాధను నా బాధగ వర్ణించి లిఖించేంత శక్తి వయసు అర్హత నాలో ఇంకా రాలేదు. అంత వరకూ, నా బాధలన్నీ, ఆనందాలన్నీ మీవే. (నన్ను నేనెవరితోనో పోల్చుకుంటున్నానని అపార్ధం చేసుకోరని ఆశ. నా అర్హతనీ స్థాయినీ తెలుసుకునే మసలుతాను.)