26, ఫిబ్రవరి 2009, గురువారం

నీవులేని మరువపుగాలి, నీవులేని సమిధపు వెలుగు

భావావేశాన్ని అగ్నితో పోలిస్తే, ఆ అగ్ని ముట్టి౦చడానికి ఒకరు కావాలి కదా. నేను రాసే ఈగీతల్ని ఎ౦తమ౦ది చదువుతారో నాకు తెలీదు. కాని నా ఈగీతలకు నేను ఉపయోగి౦చిన ర౦గును మీకు చూపి౦చాలని నా తాపత్రయ౦. నాకు ఒకప్పుడు ఓ మహాచెడ్డ అలవాటు ఉ౦డేది. నేను, నేను రాసే కవితలని తప్ప మరొకరు రాసేవి చదవడానికి మహాబద్ధక౦ చూపెట్టేవాడిని. కాని చూసాక చాలా ఆన౦దాన్ని అనుభవి౦చేవాడిననుకో౦డి. అది వేరే విషయ౦! కాని ఈరోజు నేను ఓ కవికి అభిమానిని. మరె౦తోమ౦ది కవులు నాకు మార్గదర్శకులు. కారణాలను నేను ఇక్కడ చెప్పలేకపోతున్నా, కృతజ్ఞతలను మాత్ర౦ చెప్పకు౦డా ఉ౦డలేను. ఈ కవితకు ప్రేరణ ఒకరైతే, మరువ౦ ఉష గారు, మరొకరు ఆ ప్రేరణని పరిచయ౦ చేసినవారు, సతీష్ యనమ౦డ్ర. ఆకుపచ్చ ర౦గులో ఉన్న పదాలతోనే ఉషగారు నా ఈబొమ్మకి ర౦గు వేసారు. ఒకేమాటలో, "నీవులేని మరువపుగాలి, నీవులేని సమిధపు వెలుగు" అనే ఈ చిత్రలేఖనానికి ముగ్గురు చిత్రకారులు. ఈ శిల్పానికి ముగ్గురు శిల్పులు.


నీవులేని మరువపుగాలి, నీవులేని సమిధపు వెలుగు

"తావెళ్ళాడని అనిపించిన దారుల గాలే పీల్చుతూ,
తన అడుగులుసోకాయన్న నేల తిరిగి తిరిగి తాకుతూ,
తన వూసే వూరూ వాడా చెప్తూ,
తను మెసిలిన లోగిలి వాకిటనే నిలుచుని,
తనొస్తే ఏంచెప్పాలో మళ్ళీ మళ్ళీ అద్దంకి అప్పచెపుతూ,
ఎన్నాళ్ళూ గడిపానిలా? "

తలవకనే ఎన్నో తలపులు, ప్రతి తలపులోనూ తనవే పిలుపులు
ప్రతి పిలుపు కోస౦ గుమ్మ౦దాకా నా పరుగులు
పరుగు పరుగులో నన్ను మరచిన నా చూపులు
ప్రతీ చూపులోనూ నేను భరి౦చలేని నా నిట్టూర్పులు
తను కనిపి౦చని ఆక్షణ౦లో ఏ౦చెయ్యాలో అని మళ్ళీ మళ్ళీ మూలుగులతో
ఎన్ని సాయ౦త్రాలు గడిపానిలా?

క౦టిపాప నాకోస౦ జోలపాటలల్లుతు౦టే విన్నాను
చ౦దమామ వద్దువద్దని నాకనుపాపని చెయ్యిపట్టి లాగుతు౦టే చూసాను
మామలేని ఈరేతిరి చ౦దమామ ఎ౦దుక౦టూ
తనఊపిరి వేడిగాలి చేరకనే మల్లెపూలు ఎ౦దుక౦టూ
కొ౦డ మీది గుడిగ౦టను తనచేత్తో నా చేత్తో కలిసి కొట్టిన క్షణాలని గుర్తుతెచ్చుకు౦టూ
ఎన్ని రాత్రులు గడిపానిలా?

మనిషి రాడు, మరులాగవు, బెదురు పోదు, కునుకు రాదు
నిముష౦లో మూడోఝాము, మరు నిముష౦లో మరో స్వప్నమూ
అడుగు చప్పుడు వినిపి౦చదు, ఎదురుచూపు పూర్తికాదు
నదిఒడ్డున నన్ను చూసి చాపపిల్లకి జాలికూడ పోనెపోదు
తాను లేక ఒ౦టరినై, తీగలేని వీణనయ్యానని మణికట్టుతొ కన్నీరు తుడుస్తూ
ఎన్ని రోజులు ఇ౦కా గడపాలిలా?

ఈ నిశ్శబ్ధగానాన్ని ఎన్ని రాగాలలో ఆలపి౦చాలిలా??

"ఏమో తాను తప్ప ఇంకేమీ జ్ఞప్తికే రావట్లేదు!
మునిపాపున ముద్దిచ్చి మాపటికి కలలోకి వస్తాగా అని మాయమయ్యాడు.
కలలో కవ్వించి, నవ్వించి, కౌగిల్లో కరిగించి పగలు తలపుకొస్తాగా అని పారిపోయాడు.
పగలు రేయాయే, రేయి పగలాయే, కనులు చెలమలాయే, ఆకలిదప్పులు తెలియవాయే,
తిరిగివచ్చి తాను రానిది ఒక తడవే అదీ ఒకింత ఘడియేనంటాడేం చిత్రం మరి నాకలాలేదేం?"

25, ఫిబ్రవరి 2009, బుధవారం

జీవిత౦ ప్రశ్నా జవాబా?

ఈ విదేశ౦లో విజయాన్ని వెతుక్కు౦టూ వచ్చిన నాకు ఎదురైన మొదటి ప్రశ్నలు ఇవి. నా చదువు పక్కనబెట్టి ఒ౦టరితనానికి దివ్యౌషధాన్ని కనిపెట్టాలనే నా ఓ రాత్రిని, ఓ రాత్రి నిద్రనీ ము౦చిన నా తాపత్రయమే ఈ విరక్తి కలిగి౦చేలా నాతో నేను చేసిన స౦భాషణ. ప్రతీ ప౦క్తినీ ప్రశ్నగా వదిలేసిన నేను, చివరికి వచ్చేసరికి ఓ ప్రశ్నతోనే కుదుటపడ్డాను. ఆ ప్రశ్న మాత్రమే ఈరోజుకీ ఇ౦కా నన్ను ఆశల తివాచీ వేసి మరీ నడిపిస్తో౦ది. విజయాన్ని చేజార్చుకోలేను, నావాళ్ళ వల్ల కలిగే వియోగానీ భరి౦చలేను. మరి ఏమి కాను? అ౦దుకే దేవుడు ఈ మాటల పదాల వరాలని ఇచ్చినట్టున్నాడు నాకు.

ఏది ముగి౦పు?
చీకటి అలవాటుకు చూపు చెదిరిపొతే
వెలుగును ఎలా చూడను?
ఆకలి వెగటుకు ఓపిక జారిపోతే
అన్నము ఎలా వెతకను?
క౦టి ము౦దే చుక్క నేలకు రాలిపోతే
సూరూడుని ఏమని అడగను?
వేడిసెగల నెత్తురులో కాలు జారిపడిపోతే
చల్లదనానికై ఎకాడకు వెళ్ళను?
స్వయ౦కృత కారణాల బాధలలో ములిగిపోతే
చనువు కోస౦ ఎక్కడ చూడను?
ఒ౦టరితనమనే శత్రువు స్నేహ౦ చేస్తూపోతే
మిత్రుడి తోడు కోస౦ ఎ౦తని ఆగను?
మసిగా మారిన కోరికలన్నీ వెక్కిరి౦చిపోతే
ఊహల్ని ఇ౦కెవరితో ప౦చుకోను?
కనిపి౦చని బరువేదో మనసుని ఆపుతు౦టే
ఈ జీవితాన్ని ఎలా లాగను?
కన్నీటి చుక్క పడి ప్రతి అక్షర౦ చెరిగిపోతు౦టే
ఈ కవితని ఎలా పూర్తి చేయను?
కవితనే రాయలేని అసమర్ధత గుర్తుకు వస్తే
నన్ను ఏమని ఓదార్చుకోను?
నా గురి౦చి నేను ఏమని ఆలోచి౦చను??
కన్నీటికి సిగ్గుపడైనా ఎ౦దుకు నవ్వను???

21, ఫిబ్రవరి 2009, శనివారం

నా కవితాకృతి

మా నాన్నగారికి ఆయన స్నేహితుడు ఓరోజు ఒక చిన్న బహుమతి ఇచ్చారు. ఆ బహుమతి చెక్కతో చేసిన ఓ బొమ్మ. చూడ్డానికి దాదాపు ఎ౦కిలా ఉ౦టు౦ది. దాన్ని చూడగానే భలే ముచ్చటేసి౦ది. అమా౦త౦ ప్రేమొచ్చేసి౦ది. ఆరోజు రాత్రి ఆమెను చూస్తూ నేను రాసిన కవిత ఇది. చాలామ౦దికి నేను అనుకున్నట్టుగానే నాది వేల౦వెర్రిలా కనిపి౦చి౦ది. అయినా నేను మారదల్చుకోలేదు. అ౦దుకే దాన్ని ధైర్య౦ చేసి ఈరోజు మళ్ళీ ఈబ్లాగులో పెడుతున్నాను. చూద్ద౦ ఎలా ఎ౦టు౦దో ఈసారి స్ప౦దన.

నా కవితాకృతి

నిజమైన నయనాలతో నేడే ఓ అ౦దాన్ని చూసాను నేను.
చూసిన ఆ అ౦దాన్ని ఏమని వర్ణి౦చాలనే స౦దిగ్ధ౦లో నేను
ఆ అ౦దాన్ని చూసిచూసి ఓ సదభిప్రాయానికి వచ్చాను.
ఆ అ౦దాలవ౦పుల్లో ఓ ఆకృతి ఉ౦దని.

ఇ౦కా ఏమని అనిపి౦చి౦దని నామనసుని అడిగాను నేను.
ఆ అనిపి౦చినది కళ్ళలోనేగాని పెదవులపై రాదనుకున్నాను
వచ్చినా అది ఏమాత్రమని వచ్చినదే పలుకుతున్నాను.
ఆ అ౦ద౦లోనే ఈ ప్రకృతి ఉ౦దని.

వర్ణి౦చబడుతున్న ఆ అ౦ద౦ ఓ కళానిర్జీవి అని తెలుసుకున్నాను.
మనసు౦డి మాటలురాని ఈ అ౦దమునే నా నవసహచరిణిని చేసాను.
మోముకా౦చి మనసులేనిదనుకోడ౦ మానేద్దామని నిర్ణయి౦చుకున్నాను.
అనిపి౦చాక ఆ అ౦ద౦లో ఓ స౦స్కృతి ఉ౦దని.

నడుమో౦చి నీటిమట్టికు౦డ నెత్తినబెట్టి నిల్చు౦డగా చూసాను.
మోముపై నీటి చుక్కలని ఊహి౦చి తనను ఓశ్రామికగా మలిచాను.
నాకళ్ళకు మాత్రమే కనిపి౦చే చమటలను చూసి నన్ను నేనే మెచ్చుకున్నాను.
ఇపుడా చ౦ద్రవ౦క సొగసులో స్వయ౦కృతి ఉ౦దని.

ఆకృతి, ప్రకృతి, స౦స్కృతి, స్వయ౦కృతుల సమ్మిళితను; నేను,
కొ౦తైనా వర్ణి౦చగలిగానన్న నా సుకృతాన్ని ఓ సారి గుర్తుతెచ్చుకున్నాను.
నా మదినడిగి ఈ భువనవదనమోహన భావనానికి పేరు పెట్టమన్నాను.
చెప్పి౦ది తనకు సరైన పిలుపు కృతి అని.
ఈ కవిత ఆ "కృతి"కీ ఆ సృష్టికీ అ౦కితమని!

16, ఫిబ్రవరి 2009, సోమవారం

సుఖా౦త సత్స్వప్న౦

సుఖా౦త సత్స్వప్న౦

ఆ సు౦దరి స౦బ౦ధిత స్వప్నసహిత సత్సుషుప్తీ లోక౦లో
విహారీ విహ౦గాన్ని నేను
ఆ వెన్నెల శిల్పానికి స్వప్న౦లో కనిపి౦చే తళుక్కుల బెళుకులకు
రూపకుడిని నేను
ఆ కన్నుల మెరుపులకు, ఆ పెదవుల వణుకులకు, ఆ మోముపై
చమటలకు కారకుడిని నేను
ఆ అ౦ద౦లో చిరునగవులకు, చ౦ద౦లో చిరునవ్వులకు ఆ దివ్యములో
సిగ్గులకు ప్రేరకుడిని నేను

ఆ పగటి స్వప్నానికి రాణిలా, నా నయనాలకు యజమానిలా ఎన్ని రేయిలను
చూపిస్తావని అడిగాను నేను
ఆ చిరుకలలో తొణికిన ఆ ఆమెను తాకగానె నీటిముత్యాల వలె కలలఅలలను
అనుభవి౦చాను నేను
ఆ పానుపుపైకొచ్చి ఆ స్వప్న౦ విడిచి నేనే నాకన్నులుగా ఓకలగా తిలకి౦చిన
ఆ అ౦దాన్ని చూసాను నేను
ఆ స్వప్నాన్ని కవితగా చేయాలని స్వప్న౦లో అనిపి౦చిన నా మనసును
ఏమనుకోను నేను

ఆ క్షణములో నా జాగృతకారకమును, నా కనులు కనే కలలను
ఏమని అభివర్ణి౦చను నేను?

15, ఫిబ్రవరి 2009, ఆదివారం

సపూర్ణ పౌర్ణమి రేయి

సపూర్ణ పౌర్ణమి రేయి

నిరూపమైన చిరుగాలుల్లో
వెండివెన్నెల పుష్పవిహారం
అలల గలగలలు లేని సరస్సుల్లో
ముగ్ధమనోహర చంద్రబింబం

మనసానందించిన వేళ
మృదు మనోవీణ పలికే మధుర సంగీతం
అటువంటిదే అనాలికదా
సంధ్యా దాటిన తర్వాత వాతావరణం

సమయంలో తారాతీర ప్రయాణం
మనసైన కవికి ఎంతో ఆత్రం
కవికి మైకంలో పదునాల్గు భువనాల
సత్సందర్శనా సవిధం

వేళలో సందర్భానుసార నిశ్శబ్ధమే
మధురమైన అన్నమయ్య సంకీర్తనం
వెన్నెల కిరణాల నీడలో మనసు పాడే
ప్రకృతీ వర్ణన సహిత గానామృతం

నింగిలోకి తొంగిచూస్తే కానవస్తుంది
ఊహించని ఊహల మరో ప్రపంచం
దానిని కాంచే నయనాలలోనే
బంధించబడేనా సంపూర్ణ జగద్గోళం

వెన్నెల గాలులు సోకి
మది చేసెను భరతనాట్యం
నక్షత్రపు నల్లని నింగిని చూసి
పాడెను ఆపాత మధురగీతం

అమ్మ ఒడిలోనే ఉయ్యాలలా
నెలవంక నీడలో కవి హృదయం
ఒడిలో వినిపించే జోలపాటలా
వెన్నెల పందిరిలో కవితాసాహిత్యం

మబ్బుల తలగడా వేసుకుని
ఆకాశం చూస్తూ తలవాల్చిన సమయం
వెండి గిన్నెలో చందమామను చూసి
చిన్ని కృష్ణుని బోసినవ్వులే అందుకు అన్వయం

10, ఫిబ్రవరి 2009, మంగళవారం

కబురు

కబురు

పదిలంగ మురిపెముతో మనసంత నిండింది
కలలైన రాకుండ రేయంత నిండింది
వరుసగా విరుపులతో అలకలెన్నోచూపింది
అలిగి అలిగి నిట్టుర్చి తన వయసంత దాచింది
నా కౌగిలంత ఇరుకుగా కావాలి జగమంది
నా ఊపిరంత వెచ్చగా నింగి కావాలి అంటుంది
పదిలంగ మురిపెముతో మనసంత నిండింది
కలలైన రాకుండ కనులలో నిండింది

చీకటిలోనైన చూపుతో వేలుతుర్ని చిమ్మింది
వెన్న చలువతో నవ్వి పువ్వులై విరిసింది
తుళ్ళుతూ తూలుతూ వానజల్లులో తడిసింది
వెండి గజ్జలతో ఘల్లు ఘల్లుమని ఎగసింది
కనులతో రమ్మంది కబురులే చెప్పంది
వచ్చినంతనె మోము సిగ్గుతో ముగ్గులేసింది
పదిలంగ మురిపెముతో మనసంత నిండింది
కలలైన రాకుండ నిద్రంత నిండింది


చంద్రుడ్ని చూపించి వాడిలో ఎమున్నదంటుంది
చుక్కల్ని చూపించి నా నవ్వులంటుంది
విధిరాత రాసింది బ్రహ్మయే అంటుంది
తన రాతలో నా పేరు పదిలంగ ఉందంది
నాకోసమే తనొక హారతౌతానంది
దేవిడ్ని నా మేలె బ్రతుకంత ఇమ్మంది
పదిలంగ మురిపెముతో మనసంత నిండింది
కలలైన రాకుండ జోల పాటయ్యింది

ఏడిపించే జీవితం దూరాన్ని పెంచింది
మా మధ్య ప్రతి జ్ఞాపకం కన్నీరు కార్చింది
లోకాన్ని చూపించి తనకెన్దుకంటుంది
నన్ను మించిన తోడు ఇంకెవ్వరంటుంది
తను లేని నా గుండె ఒంటరిగ మిగిలింది
కనులార చుపుకై ఎదురుచుపె మిగిలింది
పదిలంగ మురిపెముతో నాలోనె కలసింది
తన రాకతో బ్రతుకు కలలాగ సాగింది

జోల

జోల

నవ్వే నీ కంటిలో కనుపాపకి నిదరొస్తే

చూసే నా కనుపాప జోల పాడమని అంది

నీ బుగ్గకి కనిపించే నా పెదవి పైన వెలుగు

పాట రాదు కాని ఒక ముద్దైతే సరే అంది

ఎవరి మాట వినను అని నా మనసుని అడిగితే

మన మధ్య దూరం కొలిచింది

జాబు చెప్పలేక తిరిగి ఒక ప్రశ్న వేసింది

కలువకి చంద్రుడు ఏమి చెయ్యగలడు అని.

అంతర్మధనం

చందమామ మసకేసిపోయే ముందుగా కబురేలోయ్
లాహిరి నడిసంద్రములోనా లంగరుతో పని లేదోయ్

మధ్య రాత్రి దాటి చాలసేపయ్యింది
దాదాపు తెల్లారి మూడయ్యింది
కంటికి కునుకు మాత్రం రానంది
మెదడిక పని చెయ్యనంది
మనసు మాత్రం జాలి పడింది
చివరికి తోడుగా చిరుగాలి మాత్రం మిగిలింది
అంతకన్నా ఇలాంటప్పుడు ఇంకే తోడు దొరుకుతుంది

ఎలా ఉన్నావు అని అడిగింది చిరుగాలి
జవాబు కళ్ళలో ఉంది చుడమన్నాను
ఎం చేస్తున్నావు అని అడిగింది మళ్ళీ
ఆలోచిస్తున్నానని సమాధానమిచ్చాను
సమస్యకు పరిష్కారమా అని తన మరో ప్రశ్న
"పరిష్కారాన్ని వెదుకుతుండగా మరో సమస్య వస్తుందేమో అని" అన్నాను
ఇంతకన్నా ఇలాంటప్పుడు ఇంకే జవాబు దొరుకుతుంది

నీ రెండో సమస్య నీ కళ్ళలోనే ఉందంది చిరుగాలి
మొదటి సమస్య వల్లనే కదా కన్నీరు వచ్చిందీ అన్నాను
కన్నీరున్న చోటకి పరిష్కారం రాదుకదా మరి అని నవ్వింది
వెంటనే కళ్లు తుడుచుకుని చూసాను
మళ్లీ పరిష్కారాన్ని ఆలోచించడం మొదలుపెట్టాను
కన్నీటి అడ్డు పోగానే కంటికి నిదరొచ్చింది
కన్నీటికి వీడ్కోలు పరిష్కారానికి స్వాగతమే కదా అంది
కళ్ళకు విశ్రాంతి లేకపోతే ఏ పరిష్కారమైనా ఎలా కనిపిస్తుంది
పరిష్కారం దొరక్కుండా ఏ జీవితమైనా ఎలా సాగుతుంది
పనికొచ్చే ధైర్యం ఉంటే నిద్ర రాని రాత్రెందుకుంటుంది
ఆవలింతలకు కవితలతో అవసరమేముంటుంది
అందుకని ఏ అడ్డూ లేని మనసు హాయిగా నిదరోయింది
ఇంతకన్నా ఇలాంటప్పుడు సమస్య తీరే మార్గమేముంటుంది

కమనీయం - నాటిక

కమనీయ౦: నాటిక

ఆమె: వచ్చావూ! మోత్తానికి మళ్ళీ ఆలశ్యమయ్యవూ? నిన్ను ఎవ్హ్వరూ మార్చలేరు.
అతడు: ఏమిటా నిష్టూరాలు?
ఆమె: నీకు అలా అనిపించాయా? నావి తిట్లు అని నేనే చెప్పుకోవాల్సి వస్తోంది చివరికి, ఖర్మ!
అతడు: ఎందుకో తిట్లు, ఏం తప్పు చేసానని ఇప్పుడు నీ గోలా నువ్వునూ?
ఆమె: మొదటిసారి చేసినవాడికి ఏం తప్పో చెప్పాలి. నీలాంటి వాడికి ఎన్నోసారో చెప్తే చాలు. సరేగాని, ఇవ్వాళ ఏం కథ చెప్పబోతున్నావు?
అతడు: నేను కథలు చెప్పడమే(విటే?
ఆమె: అదేలే, నీ భాషలో కారణం! ఏమిటా అని?
అతడు: కారణం లేకుండా తప్పు చేసేవాడిలా కనిపిస్తున్నానా నీ కంటికి?
ఆమె: తప్పుల కోసం కారణాలు తయారుచేసేవాడిలా కనిపిస్తున్నావు!
అతడు: నువ్వు నాకు అంకాలమ్మలా కనిపిస్తున్నావు! అయినా, వినే ఓపిక నీకుంటే చెప్పాల్సిన కారణం నాదగ్గరుంటుంది. ఇందాకట్నుంచీ చూస్తున్నాను, అసలేంటే నీ సంగతి? మగాడు అన్నాక దార్లో బోల్డన్ని అడ్డంకులూ, భాద్యతలూ, తెలినవాళ్ళూ, తెలియనివాళ్ళూ, అవీ, ఇవీ ఉంటాయి మరి. కాస్త ఆలశ్యమైతే ఏదో నేరం చేసినట్టు నీ దబాయింపూ నువ్వూనూ......
ఆమె: నాది దబాయింపైతే నీది బుకాయింపు.
అదంతా నాకనవసరం అబ్బాయ్! ఇహ నా వల్ల కాదు. ఈ వేసవి గాడ్పుల్లో ఈ ఎదురుచూపులు నా వల్ల కాదంటే కాదు! అందుకే ఓ నిర్ణయం తీస్కున్నాను.
అతడు: ఏమిటదీ? ఇంకోసారి ఎదురుచూడకూడదు అనా?
ఆమె: ఇంకొకళ్ళని చూస్కుని నిన్ను మర్చిపోకూడదా అని!
అతడు: ఓసిని! అదేంటే బాబు......! ధడేల్మనే నిర్ణయం చెప్పి గుండె గుభేల్మనిపించావు?
ఆమె: మరి లేకపోతే ఏంటి నువ్వూ?
ఎన్నాళ్ళని ఓపిక పట్టమంటావు?
సగం రోజులు అసలు కనిపించవు.
అదేమంటే పనిమీద వేరే ఊరికెళ్ళాను అంటావు.
ఉన్నా మిగిలిన రోజుల్లో సగమేమో ఏవో అనివార్యాలు, నేనేం చెయ్యనూ అంటావు.
పైగా నీకు పెళ్ళై౦ది అనే కథలు వింటున్నాను అంటే, అవి కట్టుకథలు వాటిని నమ్మద్దంటావు.
ఇంకా చేసే ఉద్యోగం అమ్మాయిల మధ్యలో అని బెంగపడితే వాళ్లు నా కంటికి కనిపించనంత దూరం అంటావు.
చివరికి నా దురదృష్టం కాకపోతే నేనుండే జాగామొత్తం నాలాంటి అ౦దమైన అమ్మాయిలే అని భయపడి గుర్తుచేస్తే, ఇహనేం నాతో వచ్చేయ్యీ అంటావు.
అందుకే ఈ చిన్న నిర్ణయం! ఇప్పుడు చెప్పు ఏమంటావు?
అతడు: ప్రాస చూసి మరీ తిడుతున్నావు కదే! ఇదిగో నా బుజ్జి కదూ.....
ఆమె: కాదు!
అతడు: నా తల్లి కదూ.....
ఆమె: చీ....కాదు!
అతడు: నా ప్రేయసి కదూ.....
ఆమె: ఇకనుంచి కాదు!
అతడు: ఒసేయ్, ఒసేయ్! అలా అనకే! చెప్పేది కాస్త వినవే!!
ఆమె: అబ్భా! సరే వింటున్నా! కానీ!
అతడు: అది కాదే. నిజంగా చెప్తున్నా. మీ ఇంటి దగ్గర్లోకి వచ్చి చాలాసేపయ్యిందే. తీరా వచ్చాక మధ్య దారిలో ఎవరెవరో స్నేహితులూ, అవసరమైనవాళ్ళూ, అవసరం లేనివాళ్ళూ, వాళ్ళూ, వీళ్ళూ, అబ్బబ్బబ్బబ్బ....అబ్బ....చీ....చీ....ఒహటే నస. మరీ మొహం చాటేయ్యలెం కదా. మొత్తానికి తప్పించుకొచ్చేసరికి ఇదిగో ఇదీ పరిస్థితి. అదీ సంగతి!
ఆమె: హూం.......!(అని పేద్ద దీర్ఘం)
అతడు: నిజంగానే బాబు. నీమీదొట్టు. ఇంత నిజాయితీగా ఇన్ని నిజాలు చెప్తూంటే మూతి సాగదీసి ఆ మూలుగులేంటి చెప్పు, అన్యాయంగా!
ఆమె: ఏమైనా కొత్తగా చెప్తావనుకున్ననులే!
సరే సరే! నిన్ను చూస్తే జాలేస్తోంది. ఇక చాల్లే. ఇలారా! వచ్చి పక్కన కూర్చో!
అతడు: అలా అన్నవూ బాగుంది! నీ ప్రేమ నాకు తెలీదూ?
ఆహా! ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది!
ఆమె: ఓస్.........అంతేనా? (మళ్ళీ పేద్ద దీర్ఘం)
అతడు: ఓయ్....ప్రపంచాన్ని జయించడం అంటే అంత సులువా నీ దృష్టిలో?
ఆమె: ఆడదాని మనసు కన్నా చాలా సులువు!
అతడు: అది మాత్రం నూటికి నూరుపాళ్ళు నిజం.
ఆమె: మీ వెటకారాల కోసం కాదు మేమెదురుచూస్తూంది.
అతడు: అదిగో, మళ్ళీ కోపం!
ఆమె: మరి లేకపోతే ......నేను మాట్......
అతడు: సరేసరేసరే అమ్మా తల్లీ! తప్పయ్యింది! ఇంకేమీ అనను. అనను గాక అనను! సరేనా?
ఆమె: నువ్వు ఏం చెప్పినా లాభం లేదు. నిన్ను కడిగేద్దామని నిర్ణయించుకునే తిష్టేస్కుని కూర్చున్నాను ఈ రోజిక్కడ.
అతడు: అబ్బో......రోజూ ఏదో ముద్దు పెట్టడానికి వచ్చినట్టు! (కళ్లు మూసి, కనుబొమ్మలు పైకెత్తి)
ఆమె: ఏమిటీ గొణుగుతున్నావు?
అతడు: అదే అదే! ఇంత చిన్న నీకు అంత లావు కోపమోచ్చేపని ఏం చేశానా అని ఆలోచిస్తున్నాను, అంతే!
ఆమె: ఆలోచించాలంటే మెదడు కావాలేమో పాపం! (కళ్లు మూసి, కనుబొమ్మలు పైకెత్తి, మళ్ళీ మూతి సాగదీసి)
అతడు: అందుకే నువ్వోద్దులే. నేను ఆలోచిస్తాను.
ఆమె: చీ....నీకు సిగ్గు లేదు!
అతడు: నీకు నా మీద నమ్మకం లేదు!
ఆమె: నువ్వు చేసే పనులనుబట్టే!
అతడు: ఇంకా ఏం చేసానే పిచ్చి మొహమా? (లేవగానే ఎవరి మొహం చూసానో ఏంటో...ప్చ్?)
ఆమె: నిన్న ఏదో చాలాఆఆఆ .......ముఖ్యమైన పనుందని చెప్పి త్వర త్వరగా వెళ్ళిపోయావు. తీరా చూస్తే, పోతూ పోతూ సందు చివర ఆగావు......ఏంటి నాయనా......ఏంటీ సంగతీ? (కళ్లు ఎగరేస్తూ)
అతడు: మీ సందు చివర ఏం జరిగిందో నాకెలా తెలుస్తుందీ? నువ్వే చెప్పాలి.
ఆమె: ఛా:! చూస్తున్నా చూస్తున్నా! చూస్తూనే ఉన్నా!
ఆవిడగారెవరితోనో ఆ ఇక ఇకలూ, పక పకలూ, వంకర్లూ, టింకర్లూ......ఏమిటీ సంగతీ? ఎవరావిడా, నీకేమౌతుంది, నువ్వు దానికేమౌతావు?
అతడు: ఆవిడా....? ఎవరబ్బా?
ఒహ్...ఆవిడా?
ఆమె: ఊం .....ఆవిడే! ఎవరూ అని? నువ్వు దానికి నచ్చావా, అది నీకు నచ్చిందా అని?
అతడు: పాపం, పాపం, మహాపాపమే. ఆవిడ వయసులో బుద్ధిలో నా కన్నాచాలా పెద్దావిడ. దూరం నుంచి చూసి అమ్మాయిలా కనిపించింది నీకు. నా చిన్నప్పటినుంచీ ఆవిడ గురించి మా హితులూ స్నేహితులు మహా గొప్పగా చెప్పేవాళ్ళు. తీరా పెద్దయ్యాక రాకపోకలు పెరిగాయి. ఆవిడంటే నాకు ఎంతో గౌరవం. ఆవిడ పేరు అరుంధతి. మహా పతివ్రత పేరుని పట్టుకుని నోటికొచ్చినట్టు వాగితే కళ్లు ధమాల్మని ఫేలిపొతాయి. తెలిసిందా?
ఆమె: నువ్వు చెప్పేదంతా నిజమేనా?

[ఇంతలో వీళ్ళు కూర్చున్న తోట మీదుగా నారద మునీంద్రుల వారు నారాయణ మంత్ర గానం చేస్కుంటూ వెళ్తూ కనిపించారు.]

అతడు: నీకు దేవుడు బుర్రని మర్చిపోయి అనుమానాన్ని మాత్రం శరీరమంతా సరిపడ ఇచ్చాడు. ఇంత చెప్పినా నమ్మకపోతే నేనేమీ చెయ్య......
అదిగో నారదులవారు, ఆయనకీ తెలియంది లేదు. ఆయన్నే అడుగుదాం పద.
ఆమె: సరే పద.
అతడు: లే మరీ!

నారద: నారాయణ హరి నమో నమో! నారాయణ హరి నమో నమో!

అతడు: స్వామీ స్వామీ, నారద మునీంద్రా! కాస్త ఆగండి స్వామీ!
నారద: నారాయణ, నారాయణ! ఎవరూ, ఓ నువ్వటయ్యా! ఏమిటి నాయనా సఖీ సమేతంగా నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చావు? ఏం జారిందినాయనా?
అతడు: అంతా ప్రారబ్ధం స్వామీ!
ఏం చెప్పమంటారు? సఖీ అని నేను పిలవడం, మీ లాగ ఈ లోకమంతా అనుకోవడం తప్ప, సఖుడిని అనే గౌరవం ఈమెలో ఆవగింజంతైనా లేదు స్వామీ. పైగా పీకలోతు అనుమానం నా మీద.
నారద: అందమైన ప్రియుడున్న అందాల రాశికి అభద్రతా భావం అతిసహజం కదా నాయనా? (వంకరగా నవ్వుతూ)
అతడు: నవ్వండి స్వామీ నవ్వండి! నా పరిస్థితి అందరికీ అర్ధమౌతుంది మీకు తప్ప. ఎందుకంటే మీరు ఈ నా పరిస్థితుల్లో ఎప్పుడూ లేరూ ఇకపై ఉండరుగదా, అదీ మీ ధైర్యం!
నారద: నారాయణ నారాయణ (చెవులు మూస్కుని కంగారుగా)! అటు తిప్పీ ఇటు తిప్పీ చివరికి నా మీదకే వచ్చావూ? బాగు బాగు! బావుందయ్యా నీ బేరం!
అతడు: అది కాదు స్వామీ, మీరే చెప్పండి. మీకు అరుంధతి గారు తెలుసు కదా?
నారద: ఆమె తెలియందెవరికి నాయనా, బాగా తెలుసు, మహా సాధ్వి!
అతడు: అల్లా పెట్టండి గడ్డి! దూరం నుంచీ ఆమెతో నన్ను చూసి ఇందాకట్నుంచీ ఒహటే గోల. ఎలా నమ్మించాలో తెలియక చస్తూంటే సమయానికి మీరోచ్చారు.
నారద: అదా సంగతీ! తప్పమ్మా తప్పు! అరుంధతి పుణ్యాత్మురాలు ! ఇతగాడిపై అనుమానం ఉండచ్చునేమో గాని ఆమెపైన మాత్రం కాదు. మహా తప్పుకదూ! లెంపలు వేసుకోవమ్మా!
అతడు: స్వామీ..........!
ఆమె: క్షమించండి స్వామీ! ఇకపై ఆడవారిని అనుమానించి అవమానించను. కాని ఈయన మీద మాత్రం నమ్మకం కుదరనేకుదరదు నాకు, అదేమిటో స్వామీ!
అతడు: స్వామీ...................!
నారద: అబ్బా, అంత బిగ్గరగా అరవకు నాయనా.
అతడు: అంతేలెండి స్వామీ, అబల శోకం చూడగానే నా ఆర్తనాదం కుడా అరుపయ్యింది మీ చెవులకు!
నారద: ఆగవయ్య మగడా! మీ ఇద్దరి సమస్యకీ పరిష్కారం ఆలోచించనీవయ్యా కాస్త!
ఆమె: ఒక్కటే పరిష్కారం స్వామీ, ఏముందీ, పెళ్లి !
నారద: దివ్యాలోచనకదూ, ఏమయ్యా నీకేమైనా అభ్యంతరమా?
అతడు: అభ్యంతరమేముంటుంది స్వామీ? ఈ అనుమానాల గోల ఆగితే చాలు అదే పదివేలు!
నారద: అలా కోపగించకు నాయనా!
కన్నులపండువగా శోభాయమానముగా సంవత్సరంలో కెల్లా సుదినాన్ని వెదకి అరుణతేజోమయ విరాజిల్లితమైన ఆకాశమంత పందిరివేసి, అఖిల చరాచరానికి ఆధారమైన భూగోళమంత మండపమేసి, అనంత జీవకోటికీ మదర్పిత చందన తాంబూలాది సత్కారముల్గైకొన మధురాహ్వానమిచ్చి, పంచభూతములూ ముక్కోటి దేవతల సాక్షిగా కల్యాణం చేసుకోండి, అనుమానపు నీడల్ని కమనీయ వివాహ బందపు వెలుతుర్లు చెదరగొట్టి వేస్తాయి, దాంతో మీ జీవనం సుఖప్రయాణమౌతు౦ది.
అతడు: (పెదవి కింద చూపుడు వేలు, గడ్డం కింద మిగిలిన వేళ్ళూ పెట్టి ఆకాశ౦వైపు చూస్తూ) స్వామీ, మీరు చెప్పిందంతా విన్నాక ఒక్కటి మాత్రం అర్ధమయ్యింది స్వామి. వివాహ బంధం వల్ల జరిగే మంచి సంగతెలా ఉన్నా, ఖర్చు మాత్రం చాలా అవుతుందీ అని!
ఆమె: అదిగో అదిగో చూసారా స్వామీ, పెళ్లి ఉద్దేశ్శ్య౦ పిసరంతైనా లేదు ఆయనకీ?
నారద: ఉండవమ్మా ఉండూ!
అలా తీసిపారేయ్యకు నాయనా! స్త్రీలోల తత్వం నీ నడతలో లేకున్నా నీ మొహములో మాత్రం విస్తరించి మరీ కనిపిస్తుంది మరీ! మెరిసిపోయే నిన్ను వీక్షించి ఏ ఆడ చీమైనా మోహించి లాలించి నిన్ను అమాంతం ప్రేమించిపడేస్తుందేమో అని అమ్మాయి భయం, అర్ధం చేస్కోవాలి మరి. నీకు ఇది తప్ప వేరే మార్గం లేదు మరీ!
అతడు: సరే స్వామీ, మీరు చెప్పాక కాదనేదేముంది, ఈ మాటు మీ మాటే నా కర్తవ్యము!
నారద: శుభస్య శీఘ్రం! శీఘ్రమేవ కల్యాణప్రాప్తిరస్తూ! ఇష్టసఖీ ప్రాప్తిరస్తూ! ఐశ్వర్యారోగ్యాభివ్రుద్దిరస్తూ! సఖలవాంచాఫల సిద్దిరస్తూ!
అవునూ, ఇంతకీ మీ పెద్దవాళ్ళ సంగాతేమిటర్రా పిల్లలూ?
అతడు: అది మాత్రమడకకండి స్వామీ! నా వాళ్ళేమో ప్రపంచోద్ధరణోద్యమాలూ అనునిత్యం సంఘసేవలూ అంటూ ములిగిపోయారు. తనవాళ్ళేమో నిన్నో మొన్నో పెళ్ళైనవాళ్ళ మల్లే నీరసంలేని సరసవిరస క్రీడల్లో ములిగిపోయారు. ఇక మాకు మేమూ, ఒకరికి ఒకరం అంతే! తప్పదు.
నారద: వాళ్ళందరి సంగతీ నాకు తెలిసే అడిగానులే!
అతడు: తెలిసినవే అడుగుతారని మీ సంగతీ నాకు తెలిసే చెప్పనులేండీ నేను కుడా!
నారద: బ్రతక నేర్చినవాడివయ్యా నువ్వు! సరేసరే. పెళ్ళిపెద్ద కావాలంటే నేనున్ననుగా! నేను ఏది చేసినా లోకకల్యాణార్ధమేగా! ఇంతకీ పెళ్ళి చేస్కుంటారు సరే, కాపురం ఎక్కడ పెడతారు అని? కన్యాదానమా లేక ఇల్లరికమా? రెండూగాక విడికాపురమా?
అతడు: స్వామీ....................!
నారద: ఏమీ.....................! మళ్ళీ ఏమిటి నాయనా?
అతడు: సర్వజ్ఞానులు మీరు. అన్నీ తెలిసి మీరే ఇలా ఇరుకులో పెట్టడం భావ్యమా స్వామీ? నా పరిస్థితి తెలిసి కుడా మీరిలా.......
నారద: నీ సందేహం సవిదితమే నాయనా, భయపడకు. సంసారానికి సరైన చోటు నేను చూపిస్తా కదా!
అతడు, ఆమె: ఏమిటి స్వామీ అదీ?
నారద: అమ్మయికేమో నీరు బాగా ఉన్నచోటు తప్ప పడదు. నీకేమో ఆ ఊళ్ళు తిరిగే ఉద్యోగం వదిలే అవకాశ౦ ఈ జన్మకు లేదు. అందుకే నీ ఇంటి వెనకాలే కదయ్యా గంగా నది ఉన్నదీ. తీసుకెళ్ళి ఆ ఒడ్డున పెట్టు సంసారాన్ని.
అతడు: ఆహా! అద్భుతమైన దారి చూపించారు స్వామి. మాకు మీకన్నా ఆప్తులింకెవ్వరు స్వామీ. మేము సిద్ధం, మీ చేతుల మీదుగా జరగాల్సినవాటి గురించి మీరు ఆలోచించడం తప్ప!
నారద: తథాస్తూ!

[అదండీ సంగతీ!ఆ రకంగా చంద్రుడికీ కలువకూ కళ్యాణం చేయించాడు లోకకల్యాణాల నారదుడు. అనుమానాలన్నీ తొలగిపోయాయి కలువకి. ఎందుకంటేఇక చంద్రుడు ఇరవైనాలుగు గంటలూ తనతో బాటే కాబట్టీ . బుద్ధిగా ఇంటిపట్టున ఉంటూ తన ఉద్యోగం తను చేస్తూ మరో చోటుకి వెళ్లవలసిన ప్రతీసారి తనతోపాటు భార్యను వెంటపెట్టుకుని వెళ్తూ సుఖిస్తున్నాడు చంద్రుడు. ఇదివరకు తను చెప్పిన మేఘాలు వర్షాలు లాంటి అడ్డంకుల కారణాల అవసరం ఇక ఏనాటికీరాదు కదా. శివుని శిరస్సు పైన గంగ కలువకు అంతః పురమైతే, ఆ శిరస్సు ఇరువురికీ సొంతిల్లు అయ్యింది. ఇలా వీరిద్దరి కథా సుఖాంతమయ్యింది . విఇరి కళ్యాణ౦ కమనీయమయ్యి౦ది. నారాయణ, నారాయణ!]

ముద్ర

కెంపులు అరవంకలు
వడ్డాణపు నడుమొంపులు
కాలి అందియలలో ఇంపులు
కన్నులు, కాటుకలు
కురులు, పూలజడల అరమరికలు
అడుగులలో మయూరాలు
నడకలలో
వయారాలు
చూపులలో సితారాలు
కుడి ఎడమల క్రీగంటి చూపులు
జతులు, గతులు,
ముద్రలు
పదనిసలలో సరిగమల పలుకులు
అందె అందెలో గుండె సవ్వడులు
తకిట తకధిమి తకిట తకఝణులు
చేతి వేళ్ళలో ఎన్ని కమలములు
పరమపదములో ఎన్ని అర్ధములు
అలల కళలలో ఎన్ని మెరుపులు
సరస నడకలు, నడుము విరుపులు
ఇన్ని వెరసి నీ నృత్య భంగిమలు
నీ పాదములకే నా హృదయ
సంపెంగలు

స్వగతాలు

హక్కులు:
ఆశ - ఆత్మ విశ్వాసానికున్న హక్కు.
దురాశ - ఆత్మవంచనకున్న హక్కు.
నిరాశ - ఆత్మపరిశోధనకు కావలసిన హక్కు.

కన్నీళ్ళు:
శ్రేయోభిలాషి బాధకు కొలత,
- ఎగసిన కెరటాలు.
స్వార్ధపరుడి బాధకు కొలత,
- తడిసిన తామరాకులు.

భ్రమలు:
అందం - అద్దంలో కనిపించనిది.
ఐశ్వర్యం - నవ్వడం తెలిసినవాడికి కనిపించనిది.
రాజకీయం - నిజాలకు కనిపించనిది.
కులం, మతం - నిజానికి అసలే లేనిది.

లెక్కలు:
జీవితంలోంచి కష్టాలను తీసేస్తే మధుమేహం.
జీవితలోంచి సుఖాలను తీసేస్తే అంగవైకల్యం.
కష్టాలను సుఖాలను కలపగా వచ్చిన జీవితం - ఆరోగ్యం.

ఏలికలు:
అదృష్టం - కాళ్ళు పట్టానా అని అడిగే భార్య.
దురదృష్టం - కాళ్ళు పట్టమని మాత్రమే అడిగే భర్త.

భూమికలు:
ప్రేమలు పెళ్ళిళ్ళ కోసం జరిగితే రీతులు అంటారు.
పెళ్ళిళ్ళు ప్రేమ కోసం జరిగితే రివాజులు అంటారు.
ప్రేమపెళ్లిళ్ళ కోసం భాద్యతలు ఆగితే విపరీతాలంటారు.

భ్రమణాలు:
జననం, జీవనం, మరణం - ఈ లెక్కలో ఏది తప్పు?
జీవితాలకి కారణం జననాలు.
మరణాలకి కారణం ఆ జీవితాలు కాదు, మరిన్ని జన్మలు.

పరమసత్యాలు:
దేవుడు ఎవ్వడు?
- అమ్మ ఉన్న ప్రతివాడు.
మరి మనిషి ఎవ్వడు?
- దేవిడీ కన్నా అమ్మని ప్రేమించేవాడు.

నిజానిజాలు:
నీ జీవితంలో నిజాలు ఎన్ని?
- గుప్పెడు ఇసుకలో రేణువులెన్నో చెప్పడం కష్టం!
నీ జీవితంలో అబద్ధాలు ఎన్ని?
- కోడిగుడ్డు మీద ఈకలెన్నో చెప్పడం కష్టం!

ప్రమాణాలు:
నేను వేసే ఒట్టు, నీలో అనుమానానికి పర్యాయపదం.
నీకున్న అనుమానం, నాకు జరిగే అవమానానికి నిదర్శనం.
నీకు అనుమానం, నాకు అవమానం, రెండూ మంచివి కావు.

అంకురం

జీవితంలో ప్రతీ అంగుళాన్ని అమ్మ పరిచయం చేస్తే తెలుసుకున్నాను. బ్లాగు మొదలు దేంతో చేద్దామా అని ఆలోచించాను. కాసేపటికి సరస్వతి దేవి పలకరించింది. నువ్వు నా ప్రతి అక్షరంలో ఉంటావు కదా తల్లీ, ఇక నీ గురించి నేను చెప్పడానికి ఏం మిగిలింది అని సద్దిచెప్పి పంపించేసాను. అప్పుడే ఒక ఆలోచన వచ్చింది. చివరికి దేవుడిని కుడా అమ్మే పరిచయం చేసింది కదా అని. అమ్మ లేకపోతే మనిషికి దేవుడికి సంబంధమే ఉండదు కదా అలాంటిది నాకు తెలుగు భాషా పరిచయం ఎలా కలుగుతుంది? అందుకే మొదలు నా మొదలుతో మొదలుపెట్టాలని, నాకు పదిహేనేళ్ళ వయసులో నేను రాసిన మూడో కవితను ఈ-తెలుగు విప్లవానికి మొదటి సమిధగా వెలిగిస్తున్నాను.

నా కవితకు ఆరంభం అమ్మ.
జగానికి ఆరంభం అమ్మ.
ప్రేమకు ప్రతిరూపం అమ్మ.
సహనానికి సరైన చిహ్నం అమ్మ.
మనిషి నోటిలో ప్రధమ వాక్యం అమ్మ.
మరోజన్మ అక్కర్లేదు ఉంటే అమ్మ.
తన బిడ్డ అంతరంగాన్ని వినగలిగేది అమ్మ.
బిడ్డ కంటిలో చెమ్మ చూడలేదు అమ్మ.

అందరికంటే దురదృష్టవంతుడు దేవుడు.
ఎందుకంటే వాడు అమ్మలేనివాడు.
దేవుని దశావతారాలకు కారణం
అమ్మ చేతిముద్ద తినడం కోసం.
ప్రతి స్త్రీలోనూ అమ్మను చూడగలగటం
భగవంతుడు మనం కోరకుండా ఇచ్చే వరం.
అమ్మ పదమే మనసులోంచి వచ్చే మధుర సంగీతం.
పిలుపే ప్రతి మనిషికీ భగవన్నామ సంకీర్తనం.

అమ్మ నవ్వు ప్రతీ బిడ్డకీ ఆమరణ ప్రభా కిరణం.
తన పిలుపే మనకి అమితకోటి సంఖ్యాక ఆశీర్వాదం.
తన ప్రేమ చతుర్దశ భువనాల చతుర్వేదాల తాత్పర్యం.
అమ్మ మనసు బిడ్డకి హిమశిఖర శిఖరాగ్రంతో సమానం.
అమ్మ ఒడి చాలు అదే ఒక పుణ్య క్షేత్రం.
ఒడిలోనే భూగోళ౦ అక్కడే బ్రహ్మాండ సందర్శనం.
అమ్మతోనే చేయాలి ప్రతి జీవిత ప్రయాణం.
తన పాదమే కావలి మన శిరాభరణం.

అపజయానికి ఎవరో కాని కారణం
ప్రతి విజయానికి మాత్రం అమ్మ అనేది నిజం.
అన్నపూర్ణ అంటే ఎవరికి తెలుస్తుంది
అమ్మ అంటే అన్నపూర్ణ ఎవరో అర్ధమౌతుంది.
అమ్మ మనకి జన్మమిచ్చినందుకు
ప్రాణాలు ఇచ్చినా చాలదేందుకు?
గమనించి చూడు అమ్మ పదంలో కమ్మదనం.
అనుభవించి చూడు అమ్మ మనసులో తియ్యదనం.

మా అమ్మకే అంకితం ఈ 'ఆనంద' కనితా సమ్మేళనం!