17, ఫిబ్రవరి 2011, గురువారం

నీలో నేను నాలోనీవు

అణువు నీవు అనంతము నీవు
ఆదియు నీవు అంతమూ నీవు
విశ్వాంతరాళంలో అడుగడుగునా నీవు
విశ్వాంతరాళం కదులుతున్నది నీలో
నీలో నేను నాలోనీవు

నీ తత్త్వం తెలుసుననుకున్నాను
నా తత్త్వం నీది అనుకున్నాను
నీ కనురెప్పపాటు నా జీవితంలో
ప్రతి జవాబు నీవె అనుకున్నాను
మరి ఈ మాయ ఏమిటి?
మాయ ఏది ప్రకృతి ఏది?
మాయలోని నా ప్రశ్నలకు సమాధానమేమిటి?

అన్నీ నీవనుకుంటాను
అన్నిటా నీవేననుకుంటాను
నీ పదునాల్గు భువనభాండాలలో
దారి తెలియక తిరుగుతున్నాను
మరి ఈ భక్తి ఏమిటి?
భక్తి వేరు జీవితం వేరా?
భక్తి లేని జీవితానికి నీ దయ లేదంటారేమిటి?

అణువు నీవు అనంతము నీవు
ఆదియు నీవు అంతమూ నీవు
విశ్వాంతరాళంలో అడుగడుగునా నీవు
విశ్వాంతరాళం కదులుతున్నది నీలో
నీలో నేను నాలోనీవు