నా తర్వాత నేను?
సముద్రపు ఒడ్డున ఒంటరిగా నిలబడి
ఆ సముద్రపు అంచు ఆకాశంతో కలిసేచోటుకేసి చూస్తూ వెదికితే
దొరికేది ఉల్లాసం మాత్రమే కాదు, గుండె చెప్పే ఎన్నో ఊసులు,
అద్దంలో మాత్రమే కనిపించే వినిపించే ప్రశ్నలకు సమాధానాలు.
ఆ అద్దం నన్నో ప్రశ్న అడిగినప్పుడు నోరు విప్పలేక
నాకు నేనే చెప్పుకోలేక ఆ అలల్లో సంపాదిస్తాను కావలసిన జవాబులు.
నన్ను నేను మోసం చేస్కోవడం సహజమే కావచ్చునేమో కాని
నా తల వంచగలిగినవి మాత్రం ఆ హోరు సముద్రపు జోరు అలల్లోని నిశ్శబ్ధాలు.
ఆ అలల కబుర్లు వింటూ మైకం కమ్మనిదెవ్వరికి?
నా దృష్టిలో ప్రతి మనిషి గుండె చప్పుళ్ళ మధ్యనుండే
ఆలోచనల అలల గలగలలతో నేకుంగిన క్షణాన భుజం తడుతుండే
వాటి హోరుల నిశ్శబ్ధమే నాకు కలకాలం మిగిలే స్నేహమేమో!
బ్రతుకుబాటలో చివరి ఊపిరి దాకా తప్పులు చేస్తూ ఉన్నా
ఆ చివరి ఘడియలో చిరునవ్వుతో కనుమూయాలనుకునే
నాకూ, నా నడతకూ ఒరేయ్ తప్పు చేస్తున్నావంటూ
ఎంతోకొంత నన్ను అదిలించే ప్రయత్నం చేసే ఏకైక తోడేమో!
గుండె లేని రాయికీ మనిషికీ ఇంతకుమించి తేడా ఏది?
నా ఉఛ్వాసనిశ్వాసాలకు అహర్నిశలూ తిండిపెట్టి పోషించే
నా గుండె శ్రమ ఆరడుగుల చల్లని నేలకు బూడిదగా ఇస్తానా?
నాకు ఊపిరున్నంత వరకూ దాని వెర్రిపాటలను ఆగనిస్తానా?
నాకు మంచి చేసే ప్రయత్న0లో నేచూపిన కౄరత్వాన్ని
నిశ్శబ్ధంగానే భరించి సహించిన నా గుండెతో నీకు అంతం లేదని బుజ్జగించి
ఒప్పించి, ధైర్యం చెప్పి మరొకరికి దానిని పరిచయం చెయ్యగలిగితే?
నా గుండెలోని అలల నిశ్శబ్ధాన్ని మరొకరికి పంచగలిగితే?
నా మనసు నాకు అధికారియైతే, నా మనసుకూ నేను అధికారినే కదా!
నాకు లేని అమరత్వాన్నివ్వడానికి, నాకు తోడైన నా గుండెకూ,
ఆ గుండె చెప్పిన ప్రతి అందాన్నీ నాకు చూపించే నా కళ్ళకూ
నేను లేని రోజున తోడుగా ఉండి కాపాడమని మరొకరిని నియమిస్తే?
ఇది దానమా, స్వార్ధమా?
నాకు అమరత్వ౦ కావాలి, అది అసహజం, అసంభవం
నా ఊపిరికొక పరమార్ధం కావాలి, అందుకు మార్గం
స్వార్ధంతో నేను చెయ్యగలిగే దానం!!!
నేను అమరుడను!!!