3, అక్టోబర్ 2009, శనివారం

ఆక్రందన


ఆక్రందన

ఓ సాయంత్రం ఓ నది ఒడ్డున ఓ చెట్టుకొమ్మన ఓ జీవితం కనిపించింది.
ఆ కొమ్మన డొక్క అలసి రెక్క విరిగి నిలువునా వణుకుతున్న ఓ పావురం ఉంది.
ఒళ్ళంతా తడిసిముద్దైనా కన్నీటి చుక్క రాల్చాలనే ఆలోచన కూడా లేని స్థితిలో దాని గుండె ఉంది.
కనుచూపు మేరలో ఉప్పెన పొంగూ, వరద నీరూ, నిండా పొగ రంగు ఆకాశం తప్ప మరేదీ కనిపించకుంది.
చెట్టుకి కాదు, ఆ కొమ్మకి అన్ని వైపులా నీరు మాత్రమే నిండి ఉంది.
కాలు జారితే ఎన్ని అడుగుల లోతులో పడుతుందో.
రెక్క ఎగిరితే ఎన్ని రోజులకు నేల తగులుతుందో.
కన్ను రెప్పను మరచింది, గుండె ఊపిరిని మరచింది, జీవితం ఆశను మరచింది.
ప్రకృతి ప్రళయమైతే, దేవుడేమయ్యాడని ప్రశ్న మాత్రం మిగిలింది.

ఈ పావురం స్థితిలో, ఈ వానహోరులో, ఈ భయంకర సమయంలో
ఇంకా ఎన్ని జీవాలూ, ఎందరి జీవితాలూ, ఎన్ని నిశ్శబ్ధాలూ, మరెన్ని కన్నీళ్ళో.
ఊరంతా ఉప్పెనై గుండె పూర్తిగా చెరువై పగలూ రాత్రీ ఆకలిదాహాల యుధ్ధాలైన తీరు ఏ ఊహకందునో.
రాగాల పైరులన్నీ మూగజీవాల గుంపులన్నీ మనిషి జాడంటు కనిపించక శవజాగరణే చేసెనో, శవాలుగా మారెనో.
రాముడే చూడక తొక్కిన ఆ ఉడత కాలుకి ఏ దైవప్రార్ధన ఔషధమయ్యెనో.
కంటిముందు గంగమ్మతల్లి ప్రళయకాల రుద్రుడి నాట్యం చేస్తే ఇంకే ఆయుష్షు మిగిలేనో.
గాలిలో దీపానికా, లోకంలో ఒంటరితనానికా, మనిషి పాపఫలానికా, ఇది పరాకాష్ఠ దేనికో.
బ్రహ్మంగారి వాక్కున పలికెనో, బ్రహ్మ రాసిన రాతే జరుగునో
బెజవాడ దుర్గమ్మ ముకుపుడక మాత్రం గజగజమంటూ నిలుచుంది.

శివుడా మనిషి చేసిన పాపం నీవు కూడా కడగలేవా?
బ్రహ్మా నీవు రాసిన ఈ రాత నీవే మార్చలేవా?
దేవుడా నీ చేతిన పుట్టిన మనిషికి ఈ శిక్ష తప్పించలేవా?
నీవే చేస్తున్న ఈ భీకరతాండనమెందుకో తెలియనీవా?
ఇక నీదే భారమంటుంటే నా బాధ ఓసారి చూడలేవా?
నను కాపాడ రావా?
మనిషీ ఈలోపు నీ ప్రయత్నం ఆగకుండా తోటివారిని ఆదుకోలేవా?
Telugu Poem Courtesy: www.telugubhakti.com

4 కామెంట్‌లు:

మరువం ఉష చెప్పారు...

ఇదే మదిరి ఆవేదనలో వ్రాసుకున్న నా "లెక్క తప్పిన అనులోమ విలోమ నిష్పత్తి! " http://maruvam.blogspot.com/2009/05/blog-post.html కి సమాధానంగా ప్రదీప్ వ్రాసిన నిమిత్త మాత్రుడిని నేను (???) http://pradeepblog.miriyala.in/2009/05/blog-post.html

ఈ ఆక్రందనలు, ఆర్తనాదాలు తప్పనివి. ఏనాడు లేవివి?

Sky చెప్పారు...

చాలా చక్కగా వాస్తవ పరిస్థితిని మాటల్లో చూపించారు.... "అమ్మా గంగమ్మా.... కృష్ణమ్మకు చెప్పమ్మా కష్టం కలిగించొద్దని..." అని ప్రార్ధన చేయటం కన్నా ఏమీ చేయగలము?

అక్కడి పరిస్థితులను చూడకపోయినా సునామీగా సముద్రుడు చేసిన విలయ తాండవం కళ్ళారా చూసినవాడిగా వరద పరిస్థితిని అర్ధం చేసుకోగలను....

అర్ధం కానిది ఒక్కటే... "కృష్ణమ్మ పొంగిందా.. లేక ఆనందుడి మనసు బాధగా కరిగి మాటల మూటలై పొంగిందా" అని....

sreenika చెప్పారు...

ఔనండి. చాల బాధగా అనిపిస్తుంది.

ప్రాణాలు కాగితంపడవల్లా తేలిపోతూంటే
ఆక్రందనలు లంగరుకి ఉరి పోసుకుని
ఆత్మాహుతి చేసుకుంటూన్నాయి.
బంధాలన్నీ తెగిపోయి
పిండాల్లా తేలిపోతున్నాయి.
చెట్టుకో, పుట్టకో చిక్కుకున్న జీవాలలో
ఆకలి వరదలా పారుతూంది.
మీ కవిత చాలా బాగుందండి.

Harish Athreya చెప్పారు...

ఆత్మీయ
కవిత్వ౦ చాలా బాగు౦ది
ఎగరడానికి ఆ పావ్య్రానికి రెక్కలున్నాయి కద.అ౦దులో
ఎ౦త బలము౦దో అ౦త బలాన్ని ఉపయోగి౦చి ఎగరాలి అదే ప్రయత్న౦
ఎగరకు౦డా దేవుణ్ణి ప్రార్థిస్తో ఉ౦టే ఆ దేవుడు కూడ క్షమి౦చడు
అసహాయ౦ నిజ౦ కర్మ క్రుష్ణ క్రుష్ణేతి వాదినః|
తే హరేద్వే౯షిణః ఆపా ధర్మార్థ౦ జన్మయద్ హరేః||
అని క్రుష్ణుడు చపాడు కద
మీ
హరీశ ఆత్రేయ
http://ananyaspandana.blogspot.com/