10, ఫిబ్రవరి 2009, మంగళవారం

అంకురం

జీవితంలో ప్రతీ అంగుళాన్ని అమ్మ పరిచయం చేస్తే తెలుసుకున్నాను. బ్లాగు మొదలు దేంతో చేద్దామా అని ఆలోచించాను. కాసేపటికి సరస్వతి దేవి పలకరించింది. నువ్వు నా ప్రతి అక్షరంలో ఉంటావు కదా తల్లీ, ఇక నీ గురించి నేను చెప్పడానికి ఏం మిగిలింది అని సద్దిచెప్పి పంపించేసాను. అప్పుడే ఒక ఆలోచన వచ్చింది. చివరికి దేవుడిని కుడా అమ్మే పరిచయం చేసింది కదా అని. అమ్మ లేకపోతే మనిషికి దేవుడికి సంబంధమే ఉండదు కదా అలాంటిది నాకు తెలుగు భాషా పరిచయం ఎలా కలుగుతుంది? అందుకే మొదలు నా మొదలుతో మొదలుపెట్టాలని, నాకు పదిహేనేళ్ళ వయసులో నేను రాసిన మూడో కవితను ఈ-తెలుగు విప్లవానికి మొదటి సమిధగా వెలిగిస్తున్నాను.

నా కవితకు ఆరంభం అమ్మ.
జగానికి ఆరంభం అమ్మ.
ప్రేమకు ప్రతిరూపం అమ్మ.
సహనానికి సరైన చిహ్నం అమ్మ.
మనిషి నోటిలో ప్రధమ వాక్యం అమ్మ.
మరోజన్మ అక్కర్లేదు ఉంటే అమ్మ.
తన బిడ్డ అంతరంగాన్ని వినగలిగేది అమ్మ.
బిడ్డ కంటిలో చెమ్మ చూడలేదు అమ్మ.

అందరికంటే దురదృష్టవంతుడు దేవుడు.
ఎందుకంటే వాడు అమ్మలేనివాడు.
దేవుని దశావతారాలకు కారణం
అమ్మ చేతిముద్ద తినడం కోసం.
ప్రతి స్త్రీలోనూ అమ్మను చూడగలగటం
భగవంతుడు మనం కోరకుండా ఇచ్చే వరం.
అమ్మ పదమే మనసులోంచి వచ్చే మధుర సంగీతం.
పిలుపే ప్రతి మనిషికీ భగవన్నామ సంకీర్తనం.

అమ్మ నవ్వు ప్రతీ బిడ్డకీ ఆమరణ ప్రభా కిరణం.
తన పిలుపే మనకి అమితకోటి సంఖ్యాక ఆశీర్వాదం.
తన ప్రేమ చతుర్దశ భువనాల చతుర్వేదాల తాత్పర్యం.
అమ్మ మనసు బిడ్డకి హిమశిఖర శిఖరాగ్రంతో సమానం.
అమ్మ ఒడి చాలు అదే ఒక పుణ్య క్షేత్రం.
ఒడిలోనే భూగోళ౦ అక్కడే బ్రహ్మాండ సందర్శనం.
అమ్మతోనే చేయాలి ప్రతి జీవిత ప్రయాణం.
తన పాదమే కావలి మన శిరాభరణం.

అపజయానికి ఎవరో కాని కారణం
ప్రతి విజయానికి మాత్రం అమ్మ అనేది నిజం.
అన్నపూర్ణ అంటే ఎవరికి తెలుస్తుంది
అమ్మ అంటే అన్నపూర్ణ ఎవరో అర్ధమౌతుంది.
అమ్మ మనకి జన్మమిచ్చినందుకు
ప్రాణాలు ఇచ్చినా చాలదేందుకు?
గమనించి చూడు అమ్మ పదంలో కమ్మదనం.
అనుభవించి చూడు అమ్మ మనసులో తియ్యదనం.

మా అమ్మకే అంకితం ఈ 'ఆనంద' కనితా సమ్మేళనం!

కామెంట్‌లు లేవు: