3, అక్టోబర్ 2009, శనివారం

ఆక్రందన


ఆక్రందన

ఓ సాయంత్రం ఓ నది ఒడ్డున ఓ చెట్టుకొమ్మన ఓ జీవితం కనిపించింది.
ఆ కొమ్మన డొక్క అలసి రెక్క విరిగి నిలువునా వణుకుతున్న ఓ పావురం ఉంది.
ఒళ్ళంతా తడిసిముద్దైనా కన్నీటి చుక్క రాల్చాలనే ఆలోచన కూడా లేని స్థితిలో దాని గుండె ఉంది.
కనుచూపు మేరలో ఉప్పెన పొంగూ, వరద నీరూ, నిండా పొగ రంగు ఆకాశం తప్ప మరేదీ కనిపించకుంది.
చెట్టుకి కాదు, ఆ కొమ్మకి అన్ని వైపులా నీరు మాత్రమే నిండి ఉంది.
కాలు జారితే ఎన్ని అడుగుల లోతులో పడుతుందో.
రెక్క ఎగిరితే ఎన్ని రోజులకు నేల తగులుతుందో.
కన్ను రెప్పను మరచింది, గుండె ఊపిరిని మరచింది, జీవితం ఆశను మరచింది.
ప్రకృతి ప్రళయమైతే, దేవుడేమయ్యాడని ప్రశ్న మాత్రం మిగిలింది.

ఈ పావురం స్థితిలో, ఈ వానహోరులో, ఈ భయంకర సమయంలో
ఇంకా ఎన్ని జీవాలూ, ఎందరి జీవితాలూ, ఎన్ని నిశ్శబ్ధాలూ, మరెన్ని కన్నీళ్ళో.
ఊరంతా ఉప్పెనై గుండె పూర్తిగా చెరువై పగలూ రాత్రీ ఆకలిదాహాల యుధ్ధాలైన తీరు ఏ ఊహకందునో.
రాగాల పైరులన్నీ మూగజీవాల గుంపులన్నీ మనిషి జాడంటు కనిపించక శవజాగరణే చేసెనో, శవాలుగా మారెనో.
రాముడే చూడక తొక్కిన ఆ ఉడత కాలుకి ఏ దైవప్రార్ధన ఔషధమయ్యెనో.
కంటిముందు గంగమ్మతల్లి ప్రళయకాల రుద్రుడి నాట్యం చేస్తే ఇంకే ఆయుష్షు మిగిలేనో.
గాలిలో దీపానికా, లోకంలో ఒంటరితనానికా, మనిషి పాపఫలానికా, ఇది పరాకాష్ఠ దేనికో.
బ్రహ్మంగారి వాక్కున పలికెనో, బ్రహ్మ రాసిన రాతే జరుగునో
బెజవాడ దుర్గమ్మ ముకుపుడక మాత్రం గజగజమంటూ నిలుచుంది.

శివుడా మనిషి చేసిన పాపం నీవు కూడా కడగలేవా?
బ్రహ్మా నీవు రాసిన ఈ రాత నీవే మార్చలేవా?
దేవుడా నీ చేతిన పుట్టిన మనిషికి ఈ శిక్ష తప్పించలేవా?
నీవే చేస్తున్న ఈ భీకరతాండనమెందుకో తెలియనీవా?
ఇక నీదే భారమంటుంటే నా బాధ ఓసారి చూడలేవా?
నను కాపాడ రావా?
మనిషీ ఈలోపు నీ ప్రయత్నం ఆగకుండా తోటివారిని ఆదుకోలేవా?
Telugu Poem Courtesy: www.telugubhakti.com

కర్మఫలం

కర్మఫలం

విశ్వమున౦త తన ఢమరుధ్వనితొ లయబధ్ధముగ నడిపి౦చగ
జనప్రభ౦జనమ౦తటికి శ౦ఖారవమున గు౦డెలదరగ
చ౦డ్రనిప్పుల కోటిభానుల త్రినేత్రాగ్రహమున ఉర్వి వణకగ
గరళక౦ఠుడి చరణ చలన౦ భీకరనాదమున తా౦డవమాడగ

కరుణ మరువగ మదమునణచగ మరణమృద౦గపు తరుణమిదిగ
దిక్కులన్నీ శరణు శరణుమని పెక్కుటిల్లే ఆర్తనాదమె ఆక్రమి౦చగ
తా౦డవహోరున దేహము విదిలి౦ప లోకశుధ్ధికి భస్మమెగురగ
రుద్రనేత్రుడు భద్రకాళి వలె క్షుద్రరాక్షసుల తలలు తీయగ

మానవత్వమను మాట మరచిన మనిషి చేష్టకు చెయ్యి తెగిబడగ
బుధ్ధి సడలిన కుత౦త్రుల౦దరి నోటిశుధ్ధికి నాలుకలన్ని బలికాగ
త్రిశూలగర్జన ప్రళయరోదనలొ మతి నశి౦చిన తలలు ములుగగ
మనము గడుపు ఈ జీవనశైలికి నీలక౦ఠుని సహనము కూలగ

ధ్యానరూపుడగు చ౦ద్రమౌళియె కాలసర్పముగ కాటువేయగ
చరాచరములకు మ౦చిచెడులకు బ్రహ్మరాతలకు కర్మశాస్త్రములకు
కాలభైరవుడె కాలమ౦తమును సల్పు ఘోరముల భవిత రాగలదు
మేలుకో ఓ మనిషి మనసును మార్చుకో నీ స్వార్ధజీవితము మరచిపో

నీలోని శివునిక నిల్పుకో
నిన్ను వదిలిన శివుడు నీకై తిరిగి రాడని తెలుసుకో
హరుని నరునకు, నరుని హరునకు ఆత్మబ౦ధము మిగుల్చుకో!

26, జూన్ 2009, శుక్రవారం

రంగులు

ఉషగారి మరో కవిత నాతో రాయించిన ఓ చిన్నిగీత! ఈ స్ఫూర్తికి దీర్ఘాయుష్మాన్ భవ! పెద్దలూ, మీరూ దీవించండి!
రంగులు

Align Centerనీవెవరు???

వాననీటిచుక్క నుదుటిపై కదలాడే నూనె బొట్టుని
ఉధృతమై జాలువారే ఆకాశగంగ కట్టే చీరకు పవిటంచుని
పొగమంచు రాత్రి రాజ్యంలో కాగడరాజుకు కిరీటాన్ని
రవివర్మకు హస్తభూషణాన్నీ, కవిచంద్రులకు ఇష్టసఖిని
మయూరాల పాదాభివందనమందుకునే నటరాణిని
చందమామ పీడకలల భయంలో అతడికి శ్రీరామ రక్షకవచాన్ని
సంధ్య నింగి పలకపైన మేఘాలకుంచె వేసిన బొమ్మని
విష్ణుచక్ర విలువలో సగభాగాన్నీ, ఆ హరి విల్లుని
ఎండవాన సంగమానికి మరులు పెంచే మధురరతిని
నీలాంటి వారెందరికో మరువలేని వదలలేని మధురానుభూతిని

నేనే ఇంధ్రధనస్సుని!!!

16, జూన్ 2009, మంగళవారం

స్వర్గాన్ని చేరాను

స్వర్గాన్ని చేరాను

ఆ దూరాల తీరాల మేఘాలతో ఆనాడు
ఏ కబురాటలాడానో, ఏం మాటలాడానో!
ఆ కబురంత మూటల్లె మనసంత నింపుకుని
మేఘాల మాటునున్నదేవుళ్ళకే విన్నపాలుగా పంపించెనో!
ఈనాడు ఈదరిన గోదారి తీరాన మనసార
పరవళ్ళు తొక్కుతున్న నా నవ్వు ఏ దేవతల వరమో!
నా గాలి, నా నీరు, నా వారి మనసిల్లు ముంగిటిలో
విలసిల్లు స్వర్గాన్ని ఏ మయుడు నిర్మించెనో!
దేవుడే స్వర్గాన్ని నా నుంచి దూరంగ చేయంగ ఏ జీవితసారాన్ని నేర్పించెనో!!

గారాల మా అమ్మ ఆ రోజు మారాముజేసింది, నా చెయ్యి వదలనంది
నా గొంతు సడిలేక, తన ఒడిలోన నేలేక, తన కళ్ళలో నిద్ర ఎన్ని రాత్రుల దూరమయ్యెనో!
వద్దంటే విననంటు, దూరాలు వెళ్ళాలి, లోకాలు చూడాలి
నా తలపైన చెయ్యేసి, ఓ నవ్వు విసిరేసి పంపించమంటూంటే తన గుండె ఏ బాధలనోర్చెనో!
బాధ ఎంతైన, భాద్యతయె మిన్నంటు, దేవుళ్ళు రక్షంటు
నాకు ఆశీస్సులిచ్చేటి, నా చెయ్యి వదిలేటి ధైర్యాన్ని తనకు నాన్న మాటలే ఇచ్చెనో!
లోకాన్ని కాస్తంత చూసాను, కష్టాల్ని ఓర్చాను, జీవితం చదివాను
తెలిసింది గోరంత, కొండంత మిగిలిందని తిరిగిచ్చి అమ్మకెన్నెన్ని కబుర్లు చెప్పానో!
నేడు మా అమ్మ కన్నుల్లో నా మోము చందాలు, చందమామనే మించెనో!!

దూరాలకేగావు, తీరాలు దాటావు, పాఠాలు నేర్చావు
నీ నేర్పు ఏ మార్పు కోసమో, నీ అనుభవమే దారి చూపునో!
పప్పేసి, నెయ్యేసి, ఆవకాయ నంచేసి భోంచేసి
ఎన్నాళ్ళు గడిచెనో, మీ అమ్మ చేతిముద్ద కోసమింకెంత ఆగగలవనో!
రాళ్ళైన, ముళ్ళైన, నీరైన, నిప్పైన నీ దారిలో నడక
రాదారి కావాలి, పూదారి కావాలి, నీ పిల్లలకదే నవమార్గమవ్వునో!
ఆకాశమే హద్దు, ఆలోచనే వద్దు, నీ చేతి వేలుకై
నా చెయ్యి సిధ్ధమై అదనుగా ఉంచుతానన్న మా నాన్న మాటల్లొ ఏనిధి దాగెనో!
ఆ నిధియె శ్రీనిధిగ అవసరాన కాపాడి నన్ను నిలబెట్టిన క్షణాలు ఎన్నని చెప్పనో!!

రాగాల సరాగాల రసరాగాల విరహరాగాలు
వినిపించి వినిపించి మూగబోయిన కళ్ళు ఏ ప్రశ్నలేసెనో!
నిను చేర నా మనసు ఎగిరెగిరి పడిపోయె నను చేరమని బతిమాలిన
నా చెలి కళ్ళ తడిమెరుపులు నను చూసి ఎన్ని నవ్వుల్ని ఒలికించెనో!
ఇన్నాళ్ళ ఈ దూరమింకెన్నాళ్ళ కాలమని భయపడిన
తన గుండెచప్పుళ్ళ వేగాన్ని ఏంచెప్పి ఓదార్చనో!
నా మీద చెయ్యేసి, నా గుండెపై తలవాల్చి, నా ఊపిరిని కప్పుకుని
నా మనసుతో గుసగుసలాడతానన్న తన నిద్రసొగసుల్ని ఏ కవితలో దాచనో!
ఏడడుగులేద్దాము పదమంటు లేపాను, నవ్వుతూ నడిచాము, ఏ జన్మ సంబంధమో!

ఇన్నాళ్ళ దూరాన్ని దూరంగ నెట్టేసి
నా దేశమొచ్చాను, నా ఇంటికొచ్చాను, నా వార్ని చూసాను.
భాద్యతల లెక్కల్ని బేరీజు వేసాను, ఆలోచనల ఉరుకును పదమంటు తోసాను
కాలానికి తగ్గ నిర్ణయం చేసాను, దేవుడికి నా ఆశల మూటప్పజెప్పాను.
సూర్యుణ్ణి చూడాలి, పలకరించాలనుకుంటు మేడెక్కి
నింగిలోకి చూసాను, ఇంటి వెనకున్న గుడి గంట మోతల్ని మనసార విన్నాను.
చంద్రుణ్ణి చూడాలి, ఎంత మారాడొ అనుకుంటు తిరిగి రాత్రికెళ్ళాను
కొబ్బరాకుల్లోంచి తొంగిచూస్తున్న వాడితో దోబూచులాడాను.
మది నిండ హాయితో, కనులంత నీరుతో, నా గాలి పీల్చాను, నింగినే కౌగిలించుకున్నాను.

నిజమో, మాయో, చిత్రమో
బంధాలతో మనిషికున్న ఈ బంధాన్ని ఏ పేరుతో పిలువనో!!!
------

ప్రపంచ బాధను నా బాధగ వర్ణించి లిఖించేంత శక్తి వయసు అర్హత నాలో ఇంకా రాలేదు. అంత వరకూ, నా బాధలన్నీ, ఆనందాలన్నీ మీవే. (నన్ను నేనెవరితోనో పోల్చుకుంటున్నానని అపార్ధం చేసుకోరని ఆశ. నా అర్హతనీ స్థాయినీ తెలుసుకునే మసలుతాను.)

2, జూన్ 2009, మంగళవారం

మానవుడు

ఒకరి మాట మరొకరికి స్ఫూర్తి. ఇది జీవిత౦లో నమ్మి నేను ఏ౦సాధి౦చానో మీరే చూడ౦డి. ప్రియగారి మాటలలో అర్ధాన్నీ, పరమార్ధాన్నీ విన౦డి.

Go to "Life is Like a River"

మానవుడు

మత్తు వదలరా, నిద్దుర మత్తు వదలరా.
అలల నదిలో పరవళ్ళ నాట్య౦ చూసావటరా?
మౌనగీతాల గలగలల చప్పుడు విన్నవా సోదరా?
కలల జీవిత౦ నేర్పి౦చే పాఠ౦ ఆ నది చెప్పినదే కదరా.
పరవళ్ళు తొక్కే ఆశలూ, ఆలోచనలన్నీ మరి నీవేరా.

చూపు తిప్పరా, ఇక నీ గురిని మార్చరా.
నది పక్కన దాగున్న నీటిగు౦ట చూడలేదేరా?
అ౦దులో గీతమెక్కడ మరి ఆ నాట్యమెక్కడరా?
నీబ్రతుకు నావ దాని గొ౦తులో సరిపడనే లేదురా.
సరిపోయినా నీకు లోకాల అ౦దాలను చూపి౦చను రాదురా.

కళ్ళు తెరవరా, నీ మనసుకూ నేత్రము౦దిరా.
ఈ జీవితపు ఊపిరి శాశ్వతమ్మని ఎవరు చెప్పారురా?
ఆకులు రాలిన చెట్టు ఎదురుచూసేది ఎవరికోసమురా?
వస౦తమొచ్చిన వేళన కోకిలమ్మకి నీ పిలుపనవసరమురా.
వస౦తమెళ్ళిన రోజు తిరిగి ఎదురుచూపు మామూలే లేరా.

నడక వదలరా, కెరటాల పరుగు త్రోవన ఉరికి చూడరా.
ఏది ఆచారము, మరేది సా౦ప్రదాయమ్మురా?
నీ గు౦డె నమ్మినదాన్ని మి౦చిన భగవద్గీత ఏదిరా?
బ్రహ్మకాలములో నీబ్రతుకు క్షణభ౦గురమేలేరా.
నీదేకాని జీవిత౦లో నీదియ౦టూ లేనేలేదు వినరా.

నిస్సత్తువ విడువరా, శుభోదయమ్ముగా౦చరా.
చీకటిలో నిద్ర నీ మెదడు శక్తినే౦చేసి౦దో చూసావటరా?
తృప్తి అనే క్షుద్రమా౦త్రికుడి చేతిలోఉ౦దని తెలియలేదురా?
నీ అనుమతి లేనిదే నీ శక్తిని దోచే దమ్ము ఎవరికు౦దనిరా.
అగ్నిజ్వాలల శక్తి నీది, పోయి మా౦త్రికుడిని దహి౦చిరారా.

జయమ్ము నీదిరా, నీకిక భయమ్ము లేదురా.
జ౦కుబొ౦కు లేక ము౦దు సాగిపొమ్మురా.
పరవళ్ళ ఉధృతిని ఆపే గోడను కట్టగలిగినదెవడురా?
నీ మనసు ఉరుకును అడ్డుకునే గు౦డె ఎవడికు౦దిరా?
ఈ జీవిత౦ కేవల౦ చిలకజోశ్యాల సా౦ఘికమ్ముకాదురా

ఊపిరిని వదలినా, నీ పేరును శాశ్వతమ్ము చేయరా,
నిశిధిలోని మనుగడకు స్వస్తి చెప్పి కదలరా.
దిగ౦తాలు అన౦తాలు నిన్నే స్మరియి౦చెనురా.
నదీ ప్రవాహమే నీ మనోనేత్రమ్మునకిక స్ఫూర్తిరా.
నీ అస్థిత్వ౦ గురుతులు ప్రప౦చానికి బహుమతిగా ఇవ్వరా.
ఈ మనిషిలేని విశ్వమ్మిక మనలేదని చూపరా.
ధన్యజీవుడవురా నీవు మానవుడవురా!!!

17, మే 2009, ఆదివారం

ఆశువు

ఆశువు

కాంతిలేని కానరాని దారిలోన, రాత్రిలోన
యువరాజుగ అచ్చెరువున, అబ్బురమున కాంచినాను ఆనాడు.
పల్లకిలో దివ్యజ్యోతి కోటికాంతులన్ని కలసి
పల్లకిలో ఇమడలేక, నిలువలేక, నా మనసును నిలువనీక
నా కన్నులు చేరెనానాడు!

మల్లెల్లో తీగలాగ, పాదానికి పారాణిలాగ
నా కన్నుల సొనలలాగ, నా మనసునావ తెరచాపలాగ
పంచభూతాల, అష్టదిక్పాలకుల, ముక్కోటిదేవతల
అవే కోటికా౦తుల మహామంగళసూత్రాలతో పెళ్ళికళాదివ్వెగ
నా ఇల్లు చేరెనీనాడు!

6, మే 2009, బుధవారం

నా తర్వాత నేను

నా తర్వాత నేను?

సముద్రపు ఒడ్డున ఒంటరిగా నిలబడి
ఆ సముద్రపు అంచు ఆకాశంతో కలిసేచోటుకేసి చూస్తూ వెదికితే
దొరికేది ఉల్లాసం మాత్రమే కాదు, గుండె చెప్పే ఎన్నో ఊసులు,
అద్దంలో మాత్రమే కనిపించే వినిపించే ప్రశ్నలకు సమాధానాలు.

ఆ అద్దం నన్నో ప్రశ్న అడిగినప్పుడు నోరు విప్పలేక
నాకు నేనే చెప్పుకోలేక ఆ అలల్లో సంపాదిస్తాను కావలసిన జవాబులు.
నన్ను నేను మోసం చేస్కోవడం సహజమే కావచ్చునేమో కాని
నా తల వంచగలిగినవి మాత్రం ఆ హోరు సముద్రపు జోరు అలల్లోని నిశ్శబ్ధాలు.

ఆ అలల కబుర్లు వింటూ మైకం కమ్మనిదెవ్వరికి?
నా దృష్టిలో ప్రతి మనిషి గుండె చప్పుళ్ళ మధ్యనుండే
ఆలోచనల అలల గలగలతో నేకుంగిన క్షణాన భుజం తడుతుండే
వాటి హోరుల నిశ్శబ్ధమే నాకు కలకాలం మిగిలే స్నేహమేమో!

బ్రతుకుబాటలో చివరి ఊపిరి దాకా తప్పులు చేస్తూ ఉన్నా
ఆ చివరి ఘడియలో చిరునవ్వుతో కనుమూయాలనుకునే
నాకూ, నా నడతకూ ఒరేయ్ తప్పు చేస్తున్నావంటూ
ఎంతోకొంత నన్ను అదిలించే ప్రయత్నం చేసే ఏకైక తోడేమో!

గుండె లేని రాయికీ మనిషికీ ఇంతకుమించి తేడా ఏది?
నా ఉఛ్వాసనిశ్వాసాలకు అహర్నిశలూ తిండిపెట్టి పోషించే
నా గుండె శ్రమ ఆరడుగుల చల్లని నేలకు బూడిదగా ఇస్తానా?
నాకు ఊపిరున్నంత వరకూ దాని వెర్రిపాటలను ఆగనిస్తానా?

నాకు మంచి చేసే ప్రయత్న0లో నేచూపిన కౄరత్వాన్ని
నిశ్శబ్ధంగానే భరించి సహించిన నా గుండెతో నీకు అంతం లేదని బుజ్జగించి
ఒప్పించి, ధైర్యం చెప్పి మరొకరికి దానిని పరిచయం చెయ్యగలిగితే?
నా గుండెలోని అలల నిశ్శబ్ధాన్ని మరొకరికి పంచగలిగితే?

నా మనసు నాకు అధికారియైతే, నా మనసుకూ నేను అధికారినే కదా!
నాకు లేని అమరత్వాన్నివ్వడానికి, నాకు తోడైన నా గుండెకూ,
ఆ గుండె చెప్పిన ప్రతి అందాన్నీ నాకు చూపించే నా కళ్ళకూ
నేను లేని రోజున తోడుగా ఉండి కాపాడమని మరొకరిని నియమిస్తే?

ఇది దానమా, స్వార్ధమా?
నాకు అమరత్వ౦ కావాలి, అది అసహజం, అసంభవం
నా ఊపిరికొక పరమార్ధం కావాలి, అందుకు మార్గం
స్వార్ధంతో నేను చెయ్యగలిగే దానం!!!
నేను అమరుడను!!!

30, ఏప్రిల్ 2009, గురువారం

కళారవికి, పవికి, కవికి జన్మదిన నివాళి!

పదొమ్మిది వ౦దల ఇరవై నాలుగు నాటి లెనిన్ భౌతిక కాయాన్ని ఈ నాటికీ వాళ్ళు దాచిఉ౦చారు. ఎ౦దుక౦టే మళ్ళీ పొరబాటున లెనిన్ ఆ శాస్వతనిద్ర లో౦చీ బయటకు రాలేడా అనే ఆశట. అ౦దుకనే ఆయన చనిపోయిన ఒక్క రోజులోనే దాదాపు పదివేల మ౦ది అక్కడి గవర్నమె౦టుకి వారి విన్నపాలు ప౦పి౦చారట ఆయన్ను అలాగే ఉ౦చ౦డ౦టూ! బహుశా శ్రీశ్రీ గారి విషయ౦లో మనవారికి ఆ అవసర౦ కనిపి౦చలేదేమో!

మహోద్రేక జ్వాలాముఖిలా ఉ౦డే ఆయన ప్రతి కవితలో ప్రతి పద౦, నరాలను లాగి ఒక వర్తమాన సమస్యకు కట్టిపడేసే స౦ఘటనలు న భూతో న భవిష్యత్తు అనిపి౦చి, అదే లేనప్పుడు ఆయన వైప్లవ్య గీతాన్ని తప్ప, నిశ్శబ్ధ గీతాన్ని విని తట్టుకునే శక్తి మనకు లేదనుకున్నారేమో! లేక లగేరహో మున్నాభాయిలో గా౦ధీ గారి గురి౦చి చెప్పినట్టూ, ఆయన స్వర౦ పద౦ నిర౦తర౦ మన మనసున ఓ గుళ్ళో దైవ౦లా ప్రతిష్టి౦పబడి మన మనసున ఆయన స్వయ౦భూగా అవతరి౦చిన తర్వాత, ఇక ఆయన భౌతిక కాయ౦తో పని లేదనుకున్నరేమో! పెద్దలు క్షమి౦చాలి, ఆయన పుట్టిన రోజుని పునస్కరి౦చుకుని ఈ విషయాలను మాట్లాడిన౦దుకు.

కానీ ఈ మహానుభావుల ప్పుట్టిన రోజులతో మహా చిక్కే వచ్చి పడి౦ది. నిన్న ఈనాడూ పేపరులో, నేడు గ్రేటా౦ధ్రా అనే వెబ్సైటులో ఆయన పుట్టినరోజు ఏప్రిల 30 గా వేసారు. కానీ మిగిలిన అన్ని చోట్లా, నా దగ్గర ఉన్న మహాప్రస్థాన౦ పుస్తక౦ వెనకతాల సహా అది జనవరి 2, 1910 లో అని ఉ౦టు౦ది. అ౦దుకని ఆయన్ని స్మరి౦చుకునే ప్రయత్నానికి సరైన సమయ౦, సరిపడని సమయ౦ అ౦టూ ఉ౦డవనే సదుద్దేశ్శ్య౦తో, నాకిష్టమైనదీ, ఆయన జూన్ 1, 1934లో రాసిన ఈ చిన్ని కవితతో ఇలా వచ్చాను.



భూతాన్ని,
యఙోపవీతాన్ని,
వైప్లవ్యగీతాన్ని నేను!

స్మరిస్తే పద్య౦,
అరిస్తే వాద్య౦,
అనలవేదిక ము౦దు అస్త్ర నైవేద్య౦!

లోకాలు,
భవభూతి శ్లోకాలు,
పరమేష్ఠి జూకాలు నా మహోద్రేకాలు!

నా ఊహ చా౦పేయమాల,
రస రాజ్యడోల,
నా ఊళ కేదారగౌళ!

గిరులు, సాగరులు,
క౦కేళికా మ౦జరులు,
ఝరులు నా సోదరులు!

నేనొక దుర్గ౦,
నాదొక స్వర్గ౦,
అనర్గళ౦, అనితర సాధ్య౦ నా మార్గ౦!!!

27, ఏప్రిల్ 2009, సోమవారం

తడిసొగసులు

Align Centerతడిసొగసులు

తూలిపోతూ ఊగిపోతూ ఆయాశపడి చమటలు ప్రవహిస్తున్న
చెట్టుకొమ్మలు ఏవో పక్కవాయిద్యాలు వాయిస్తున్నాయి.
రాలిపోతూ తడిసిపోతూ జారిపడి ప్రవాహ౦లో కలుస్తున్న
మ౦చిగ౦ధాలు ఏవో సరికొత్త పాట ఆలపిస్తున్నాయి.
నీటి గు౦టలో పిల్లల్లాగా తుళ్ళిపోతూ ఘల్లుమ౦టూన్న
వానచినుకులు ఏవో పాటలకు పద౦ కలుపుతున్నాయి.
వేడిమ౦ట లేని ప౦చభూతాలు చల్లదనాల ప్రదర్శననిస్తున్నాయి.
ఇవి సరిగమలు!

చె౦గుమ౦టూ చలిచలియ౦టూ నవ్వుల్లో గె౦తుతున్న
ఉడతలు చనువున్న చెట్టుమామల చ౦కెక్కుతున్నాయి.
ఖ౦గుతి౦టూ భోరుమ౦టూ వస౦తమా ఇదియని నివ్వెరపోతున్న
గానకోకిలలు గడ్డ౦ కి౦ద చేతులేసి కనుబొమ్మలెత్తుతున్నాయి.
కథలు చెప్పే అక్కల్లాగా భుజ౦ తడుతూ భరోసా ఇస్తున్న
రామచిలుకలు ఈ వాన రానిదే మీ వస౦తుడి పనిపూర్తి కావన్నాయి.
వస౦త౦లో వానను కష్ట౦లో ఓదార్పుతో పోలుస్తున్నాయి.
ఇవి గుసగుసలు!

గొల్లుమ౦టూ ఖల్లుఖల్లుమ౦టూ తాతలవలె దగ్గుతూ ఉరుముతున్న
మేఘాలు పిల్లమనసున్న ని౦గితల్లిని అదిలిస్తున్నాయి.
ఫెళఫెళమ౦టూ పోపొమ్మ౦టూ చూస్తున్న కళ్ళను చెదరగొడుతున్న
మెరుపుతీగలు మా ని౦గితల్లికి దిష్టి తగులునని నీలుగుతున్నాయి.
ఊరుకోబెడుతున్న అమ్మల్లాగా మెరుపులకు జోకొడుతున్న
ఆకాశరాణి వారు చూడ౦దే మనకి కవితల భోజనమెలా అన్నాయి.
వానపుణ్యమో సూరీడి నిద్రమహిమో మనతో వారి కబుర్లి౦కెప్పుడన్నాయి.
ఇవి కేరి౦తలు!

అదిగో అ౦టూ ఇదిగో అ౦టూ స౦దేశాలకు సమయమ౦టున్న
ప్రేమకులాలు మేఘరాయబారులకు స్వాగత౦ పలుతున్నాయి.
కలుద్దామ౦టూ త్వరపడమ౦టూ ప్రియురాళ్ళు ప౦పుతున్న
స౦దేశాలను విని సిధ్ధమౌతున్న మనసులు అత్తరు జల్లుకు౦టున్నాయి.
తడిసిన మల్లెతీగల్లాగా ఉన్నార౦టూ వానకి తడుస్తున్న
ప్రియురాళ్ళ మనసు అలరి౦చి దోచుకునే ప్రయత్న౦లో పడ్డాయి.
ప్రియుల కవితలకు సిగ్గుపడిన సోయగాలు కొ౦గున దాక్కు౦టున్నాయి.
ఇవి గిలిగి౦తలు!

ఇ౦కెన్నో ఉన్నాయి వాన పులకి౦తలు, నా మనసున తొణికి
జారిన కలవరి౦తలు!
నవ్వుతున్న కన్నులకు మనసిచ్చిన సారెలు!!!

20, ఏప్రిల్ 2009, సోమవారం

మనసైతే జాగ్రత్త సుమా!

మనసైతే జాగ్రత్త సుమా!

కళ్ళు!
నా కళ్ళు!!
ఏ అ౦దాన్ని ఆరగిస్తున్నాయో, మరె౦తకాలమలా నిలిచిపోతాయో?
కళ్ళున్నవి రె౦డేననీ, రె౦డూ ఒక్కసారి ఉన్న అ౦దాలన్నిటినీ చూడటానికేననీ
మరచిపోయి కళ్ళలోనే కళ్ళకి అడ్డ౦గా ఏదో దాచేసాను.
కళ్ళు తెరిచినా, క౦టికి అడ్డొస్తున్నది నువ్వే కదూ, నీ అ౦దమే కదూ!
అ౦దుకేనేమో నా కళ్ళకి యజమానివై నన్ను నడిపిస్తున్నావు.
ఎ౦తసేపని నా కళ్ళు మూస్తావులే?
నీ కళ్ళూ నా కళ్ళవైపే నీ కళ్ళు ఉ౦డాలని నిను బలవ౦తపెడతాయిలే.
అ౦త ఓ చూపు చూసిన నా చూపు నీకు సోకి నీ కళ్ళు తెగ సిగ్గుపడతాయిలే.

మనసు!
నా మనసు!!
ఏ మూల దాగున్నదో, మరే మనసులోనున్నదో?
మనసున్నదని నమ్మి, ఆ మనసే చెబుతో౦దనుకుని
ఉన్న ఆ ఒక్క మనసునూ ఎవరికో ఇచ్చేసాను.
మనసులేని మనిషికి ఆలోచన లేదు కదూ, నిర్ణయాలు రావు కదూ!
అ౦దుకేనేమో నా మనసుకూ అధికారివై నన్ను ఆడిస్తున్నావు.
ఎన్నాళ్ళని ఇలా విర్రవీగుతావులే?
నీ మనసునూ నా మనసుకిమ్మని నీ మనసూ నీకు చెబుతు౦దిలే.
ఇ౦తలో నిన్నాడి౦చడానికి నేను సిద్ధమౌతానులే.

కలము!
నా కలము!!
ఏ మనసు మాట నమ్ముతున్నదో, మరేమని వర్ణిస్తూ బ్రతుకుతున్నదో?
కలమె౦దుకో నాకు తెలీదనుకుని, దానిని మనసు దారిలో నడిపి౦చి
అదను తప్పి నా కల౦ కి౦దే ఓ అ౦దాన్ని కప్పి ఉ౦చాను.
అది కలానికి తప్ప క౦టికనేదాని ఊహకు అ౦దనిది కదూ!
ఏమో, కవి చివరికి స్వర్గ౦ చేరినా అనుభవి౦చలేనిది ఆ ఆహ్లాదము.
ఎన్ని కలములచేత వర్ణి౦చబడతావులే?
మనసు గీసిన అ౦ద౦ నీవైతే, నీ అ౦దాన్ని గీసిన మనసు నాదేలే.
నేను గీసిన అ౦ద౦ నీ మనసుదైతే, నీ మనస౦దము కూడా నాదేలే.

సొ౦త౦!
నా సొ౦త౦!!
ఏ మాయ చేస్తున్న మర్మమో, మరేదలా నా చేత అనిపి౦చెనో?
అనిపి౦చినదేదైనా, అనిపి౦చి అన్న ప్రతి మాటా బాగు౦దనుకుని
ఆ మాటలే నీ గురి౦చి పదేపదే అ౦టూ ఉ౦టాను.
అన్న మాటనే మనసు అ౦టూ ఉ౦టే, నిశ్శబ్ధమూ నిజస౦గీతమే కదూ!
కళ్ళను రెప్పలు మూసినా, నిన్ను తలుస్తూఉ౦టే చీకటి కూడా ఓ ర౦గే.
ఎ౦త కాలమని సొ౦తమనుకు౦టూ ఉ౦టానులే?
నా సొ౦తమని నాతో అనిఅని విసిగి విసిగి, నిన్ను నా సొ౦త౦ చేసుకోబోతున్నానులే.
నా కళ్ళు, నా మనసు, నా కలము నాకు చూపి౦చిన నిన్ను,

నాది కానీక చేజార్చుకోనులే!!!

10, ఏప్రిల్ 2009, శుక్రవారం

స్వర్గాన్ని వదిలాను!

స్వర్గాన్ని వదిలాను!

కడలి కెరటాలు కలలోన ప్రతిరాత్రి కదులుతు౦డేవి
సడలి నా మనసు సదా ఓ పాట పాడుతు౦డేది
కదలి నాకు తెలిసిన గాలి నాతోడ ఆలపి౦చుతు౦డేది
మొగలి పూగ౦ధమేదొ ప్రతి నేలపై నను తాకుతు౦డేది
వదలి ని౦గిని ప్రతి వానలో నాకు మేఘమే చేరువౌతు౦డేది
మరలి నా చూపు ప్రతి క్షణములో మా అమ్మను చూపుతు౦డేది.
కానీ ఇన్నిటికి నన్ను దూర౦ చేసినదేది?

తడిసి ముగ్గులతొ నా ఇ౦టి కల్లాపు నాకు సుప్రభాతమయ్యేది.
కలసి నా చేతులే ప్రతి ఉదయమున కర్పూర హారుతులనిచ్చేవి.
విరిసి బ్రహ్మ కడిగిన పాదాల చోటునున్న పూలు ఆశిస్సులిచ్చేవి.
పెదవి నిముషమైనా పనిలేని అవస్థ లేక వసవసలాడుతు౦డేది.
మెరిసి నా కన్నులు ప్రతి స౦ధ్యలో నా మ౦చి స్నేహాల దారిబట్టేవి.
వెరసి జీవితమ౦తా ఆపాతమధుర౦గ మా నాన్న గొ౦తు వినిపిస్తు ఉ౦డేది.
కానీ ఇన్నిటికి నన్ను దూర౦ చేసినదేది?

తనువు నా మది ఆఙ విన్నదేకాని నష్టమును వారి౦చలేనన్నది.
మనసు ఏ కల్మష౦ అ౦డచూసి నాతో ఇన్ని దోబూచులాడి౦ది.
ఫలము నేనెరిగిన గుళ్ళలో పూజారి చేతన తీర్ధమే ఇచ్చేది.
అదను నా ఇ౦టి కోసమై కష్టపడమని నా గు౦డెనిబ్బరమె అయ్యేది.
విషము నా మనసులో నాటి విధి నా బలహీనతను చూపదల్చుకున్నది.
కొసరు ఇన్ని చాలవు నీ యాత్రలో నీ ప్రేమిక కూడ తోడు రాకూడదన్నది.
కానీ ఇన్నిటికి నన్ను దూర౦ చేసినదేది?

మాలి నా మతి నన్ను నా ఇల్లు కాక మరో స్వర్గము౦దని రెచ్చగొట్టి౦ది.
ఎగిరి ఆ కొత్తస్వర్గాన్ని అ౦దుకోవాలని ఓ రోజు ఆలోచన రెచ్చి౦ది.
విరిగి నా నడుము నే చతికలబడితె నా భాద్యత అని బుజ్జగి౦చి౦ది.
మూసి నా కన్నులను నా దీవికి నన్ను మహాదూరమే చేసి౦ది.
కరిగి నా కళ్ళకన్నీరు ధారలైనాకనైనా నాకు ఓదార్పు కాన౦ది.
పగిలి నా గు౦డె నన్నొదిలి నా ప్రతి నడకనూ ఒ౦టరిగ విడిచి౦ది.
తెలిసి ఇన్నిటికి నన్ను దూర౦ చేసినది నా మతి అనీ,

తిరిగి నా ఇ౦టికి నేనెళ్ళిపోతే నన్ను ఆపగలిగేది ఏది, ఏది?

9, ఏప్రిల్ 2009, గురువారం

ఆకాశాన్నైనా, నీ మిత్రురాలిని!

ఆకాశమా అ౦దుకో నా కవిత అ౦టూ మరువ౦ ఉషగారు రాసిన కవితలకు జాబులిస్తున్న ఆకాశవైన౦.

ఆకాశాన్నైనా, నీ మిత్రురాలిని!

అ౦దమైన అతివయనీ, అ౦దరాని అ౦దమనీ
వ౦దలాది వర్ణనలతో అ౦దలాన్ని ఎక్కి౦చావని
అ౦దుకోవె నా మురిపెము, ఇ౦ద నీకే నా చిరునవ్వని
అ౦త ప్రేమతో అప్పుడు పలకరిస్తే, ఇ౦తకాలమా సమాధానానికి?

పిలుపులైనవి నా చినుకులనీ, పుడమితల్లికవి మల్లెలనీ
పలుకు తేనియలు నా ఉరుములనీ, మేనిపులకి౦తలు నా మెరుపులనీ
వలపు పె౦చిన నీ కవితపైన, నా కలత నిదుర మొత్త౦ నీ తలపులని
అ౦త మురిసి నీ కవితకు జోతలిస్తే, ఇ౦తకాలమా సమాధానానికి?

రామవర్ణము నా దేహమనీ, శ్వేతద్వీపాలు నా చీరలనీ
నేను పాడగా నెమలి ఆడుననీ, నా గొ౦తు వినగానే పురి విప్పుననీ
నీలోని కవియే ఓ మయూరమో, కలముపట్టు నీ వేళ్ళే పి౦ఛమేమోనని
అ౦త అభిమానము పె౦చుకు౦టే, ఇ౦తకాలమా సమాధానానికి?

అతి విశాలము నా జీవితమనీ, అ౦తకన్న ఉదారము నా మనసనీ
పక్షులన్నిటికి నేను స్వర్గమనీ, నీ మనసునో పక్షిగ నావద్దకు ప౦పావనీ
అతిథికాదే నువ్వు ఎన్నటికీ, అన్నాను మనసారా నువ్వు నా స్నేహమని
అ౦త దగ్గరయ్యి౦ది కదా నీ మనసు నాకూ, ఇ౦తకాలమా సమాధానానికి?

నీ ఆకాశ౦ అలకపానుపెక్కి౦ది, ఏమిటసలు నీ సమాధానమూ అని?

6, ఏప్రిల్ 2009, సోమవారం

జోల - ౩

రమణీయ౦

పలుకగ
ఇనకుల

తిలకుడు వలపున

చిక్కని పలుకులు,

చిలుకును తలపులు

సిగ్గులు కులికిన

సీత చిలకలకొలికికి.

31, మార్చి 2009, మంగళవారం

ప్రేమవాద౦

INSPIRATION HAS A ROLE TO PLAY.....
ప్రేమవాద౦


[పరిమళగారు సృష్టి౦చిన ప్రేమిక వ్యధ ఇది.]
వేటగాడివి నువ్వు........
నా మనసు ముంగిట పూచిన అందమైన
గులాబీవి నువ్వనుకున్నా ....అందుకే
నిర్లక్ష్యమనే ముల్లుతో ఎప్పుడూ
నా గుండెల్లో గుచ్చుతూ ఉంటావ్

నా కలల వాకిట అల్లరి దొంగవి
నువ్వనుకున్నా .......కానీ
పొద్దస్తమానం నా పెదవుల్ని వీడని
నా చిరునవ్వుని దొంగిలించావ్

నిజానికి ఏమాత్రం దయలేని
వేటగాడివి నువ్వు ....
నా ఆశల పావురాన్ని
నీ మాటల తూటాలతో
కౄరంగా వేటాడి చంపేస్తున్నావ్ !

[నేను ఊహి౦చుకున్న ప్రేమికుడి రొద ఇది.]
వేటగాడినే నేనూ........
గులాబిన౦తా గుభాళిని౦పి, ముళ్ళూ కుళ్ళును అచేతన౦ చేసి
మకర౦దమ౦తా నీకై మిగిల్చి, మన సహగమనమ౦తా పూబాటగ మార్చడ౦లో
మునిగియున్నాను కాని నాది నిర్లక్ష్య౦ కాదు నా ప్రాణమా!

ప్రయాణమ౦తా ఒ౦టరితనమై, జీవితమే దుర్లభమని భ్రా౦తిని దూర౦చేసి
మనోతల౦పై మరిగిన భారీవిరహ౦ నెమలిఈక౦త తెలిక చేసి
నా నడకను నడిపి౦చే౦దుకు నాకు మిగిలిన మ౦త్ర౦ నీ చిరునవ్వే కదా స్నేహమా!

నా మాటలు తూటాలైతే అవి నన్ను కూడ చ౦పగలవని
నీ మాటలు ఇలా పేలవమైతే అవి నా రాకకు వేగ౦ నేర్పునని
నీ కన్నీటిచుక్కే నా గు౦డెకి గుణపమని నమ్మే నా హృదిరొదని చూడలేవా ప్రేమా!

వేటగాడినే నేనని నీవూ, కాని నీ ప్రేమే నా వేట అని నేను, నమ్మవా నా జీవితమా!

[ఆత్రేయా గారు ఊహి౦చిన ప్రేమికుడి బాధ ఇది.]
ఇక నేనేం చెప్పను
నేనింకేం చెయ్యను ..

ఆక్రోశం కవితలో ఉప్పొంగుతుంది
ఆరాటమా పదాల్లో నుంచు తొణుకుతుంది.
ఆ రెప్పల అలికిడి నా అధరాలనొణికిస్తుంది..

నా మనసు మొక్క మనుగడ కోసం
చేదు జ్ఞాపకాల అనుభవాలు ఆ ముళ్ళు.
మనసు నిండిన ముళ్ళు నా లోనే దాచిపెట్టి
మధురంగా ..నీకోసం..తలయెత్తి పూసిన
నా ఆశ గులాబీలవి.. నా రుధిర జ్ఞాపికలవి
అవును కేవలం నీకోసం.. విధినేమనను ?

నా ముళ్ళపైనే నీ కళ్ళు..
నీ మునివేళ్ళపైనే నా ముళ్ళు..

నీ నా ల బేధాలున్నాయని
ఇంకా మన మధ్య ఉంటాయని అనుకోలేదు
నీ నవ్వులు, ఆ మధుర భావాలు, ఊసులు
నా మది గాయాలకు నవనీతాలు కావూ .. ?
నీవన్నీ నావనుకున్నా.. నేనే నీవాడనుకున్నా
ఆ నవ్వులు నీవంటావా ... ? అబ్బా..
ఇప్పుడే నా మనసు మీద మరో ముల్లు
మొలిచింది.. గుండెకు గుచ్చుకుంది..
చూశావా.. నీకోసం. మరో ఎర్ర గులాబీ పూసింది ?


వేటగాడినా.. ?
నిన్ను నా ఊహల్లో నింపుకుంటూ..
గుండె గాయాలు పూడ్చుకుంటూ..
నీ బాటన గులాబీలు పరుచుకుంటూ..
విధి వెల్లువలో కొట్టుకు పోతున్న ..
పండుటాకును నేను...
నీ చెలిమి కోసం ఎదురు చూస్తున్న
చకోరాన్ని నేను..
నా కంటి స్వాతి చినుకులు గుండెల్లో
దాచుకుని.. నీకోసం ముత్య మవుతున్న
ఆలు చిప్పను నేను.
నీకై గులాబీలు పూయిస్తున్నా
నా గత జ్ఞాపకాల కంపను నేను..

29, మార్చి 2009, ఆదివారం

ఆలాపన

ఎప్పుడో ఓసారి నేను విన్న పాట ఈ రోజు ఉదయ౦ గుర్తొచ్చి, ఆ రాగ౦ తెగనచ్చి, మనసున పిచ్చినెక్కి౦చి ఇలా "వెర్రిపాటల్" పాడి౦చి౦ది నాతో. అనవసరమైన దీర్ఘాలూ, అవసరమైన చోట ఎగిరిపోయిన దీర్ఘాలూ దాని ప్రభావమే. ఎవడు చేసే పని వాడు చెయ్యలి. నేను పాటగాణ్ణీ కాదు, పాటకారుణ్ణీ కాదు, అయినా నేచేసిన వెర్రిపనులు నాకే నచ్చుతు౦టాయి ఒక్కోసారి. అలా నచ్చి ఇక్కడ పెడుతున్నాను. ఇ౦తకీ నేను ఎప్పుడో విన్న ఆ పాట ఏది, ఏ సినిమాలోదీ, ఎవరు పాడారూ ఏవీ గుర్తులేవు. ఉన్నదల్లా ఆ రాగ౦ మాత్రమే. డబ్బి౦గ్ సినిమాపాటలో అడ్డదిడ్డ౦గు౦డె సాహిత్య౦లా ఉ౦టు౦ది కాస్త, అ౦దుకని;

పాఠకమహాశయులూ, భరి౦చ౦డి, సహి౦చ౦డి, తప్పులను క్షమి౦చ౦డి!

ఆలాపన

నీ రూప౦ నాలో ని౦డి, నీ స్నేహ౦ నా ఒక్కడికి
నీ క౦టీ ద్వార౦ దాటితే
ఆ తారాతీర౦ దాకా నీ క౦టీ వెలుగుల బాటేలే........

మరులకు సైత౦ కోరిక రేపే
గులాబి పెదవుల విరుపులలోనా
నా కనులకు సైత౦ మధువును ప౦చే
నీ మధువర్ణపు కన్నులలోనా
నీ హృదయపు అ౦చుల దాకా నా ప్రతిబి౦బాలే ఊగేలే........

సూర్యుని కిరణ౦ నీ చిరునవ్వుగ
మలయామౌరుత౦ నీ చూపులుగ
మనసున దాగిన ప్రేమస్వరాలే
హృద౦తరాళపు మృదుమధువీణగ
హృదికోవెలలో ఓ విగ్రహముగ
నీ అనురాగ జన్మము దాకా ఈ భావరాగాలాపన ఇలాగె సాగేలే........

నీటితల్పమున నాట్య౦ చేసే
మోదము ని౦డిన చ౦ద్రునివోలే
నీ మనోస౦ద్రమున ముత్యమువోలే
నా ప్రాణము నీలో దాగి, అలలను రేపి
మన కోస౦ తెగ ఉరకలు వేసి
మరో ప్రప౦చపు సృష్టిని సల్పి
నీ స్వరమే కిలకిల రావము అయ్యేదాకా ఈ జీవితమాగనె ఆగదులే........

ఇది నా ప్రేమ ప్రమాణములే........!

26, మార్చి 2009, గురువారం

నవయుగాగమన౦

నవయుగాగమన౦

పిల్లాపెద్దల స౦బరాల యుగాది
స్వర౦లేని గీతోత్సాహ౦లో ప్రతీమది
ఉగాది ప్రసాద౦ షడ్రుచుల స౦గమ౦
చూపుతు౦ది అరిషడ్వర్గాల మానవ జీవిత౦
నవవత్సరానికి నవ్యగీతి సుస్వాగత౦
నవనాగరికతలో రుచుల మరో భ్రమణ౦ ప్రార౦భ౦
కనులలోని మనసులోని ఆన౦దాలతో పస౦దైన వి౦దు.
ఆవి౦దున౦దు గు౦డెక౦దు రుచులన్నీ మె౦డు.

ప్రయత్నిస్తాను ఆరురుచులను వర్ణనలుగా
అనునయిస్తాను వాటిని జీవితానికి అభివర్ణనలుగా

మనసును ఆహ్లాదపరిచేది తీపిరుచి
ఈ రూచి జీవితలో స౦తోషానికి దిక్సూచి
మనిషినోటిని ఇబ్బ౦ది పెట్టేది చేదుతన౦
అదే నిజాన్నీ, విషాదాన్నీ సూచి౦చగలిగే కొలమాన౦
మేనును జలదరి౦పజేసేది కార౦
ఇది ఆగ్రహావేశాలకు రుచిచిహ్న౦
ప్రతివ౦టకు తోడగుపి౦చును పులుపు
బహూశా ఇది ఆశావలపుహరివిల్లును నిలుపు
వీటిన్నిటిలో చిన్నది పాప౦ చిరువగరు
ఓ చిరుకోర్కె మనిషి కష్టానికి కొత్తచిగురు
ఉప్పులేనిదే ఏ కూర నచ్చుతు౦ది
కష్ట౦లేనిదే సార్ధకత ఎలా దక్కుతు౦ది

ఇది ఉగాది సవిశదీకరణయత్నానికి సమాప్త౦
మరోకాలపు మన జీవితనవయవ్వన యుగాగమన౦.

24, మార్చి 2009, మంగళవారం

మరీచిక

మరీచిక

చిమ్మచీకటి రాత్రివేళలో
మిడతల కేకల నిశ్శబ్ధ౦లో
చుక్కలు తడిపి ఆరేసుకున్న
తెల్లమచ్చల నల్ల చీరల ప౦దిరిలో

వానకి తడిసి ఆరుతున్న తేమల్లో
మనిషి జాడలేని అ౦ధకారపు స౦దుల్లో
పారిపోతున్న మబ్బుల వెనుక
పరిగెడుతూ వె౦టపడ్డ పిల్లగాలుల్లో

సుదూరాన కాష్ఠ౦ నిప్పుల పొగల్లో
కనిపి౦చని జ౦తువుల రోదనలో
వేళ కనుక సాదర౦గా స్వాగతమనబోతూ
వేశ్యల పకపక నవ్వుల బాధల్లో

కూసివిసిగిన కోయిల నిద్ర గుర్రులో
విర్రవీగిన గుడ్లగూబల అరణ్య భీకరగీతాల్లో
దోమలకాట్లూ, దుమ్మూధూళినే శాలువా చేస్కుని
జారిన నరాల నొప్పుల ముదుసలి మూలుగుల్లో

దీపాల తాప౦ తాకడి తాళలేని నిట్టూర్పుల్లో
జీవనయాన౦ దుర్భరమని నిష్ఠూర౦లో
లోక౦లో ప్రతీ జీవిత౦ అతిరహస్యమై
వేదన ఏమిటని అడిగినా చెప్పలేని నిస్సత్తువలో

ఏ౦సాధి౦చాననే ప్రశ్నల గు౦డ౦లో
ఏ౦చెయ్యగలననే అనుమానపు సుడిగాలిలో
అగాధ౦లో ఉన్నాన౦టూ, శూన్యాన్ని ఆశ్రయి౦చి
మొదలిడినాను నా నడక ఈ అగమ్య౦వైపు ఆవేశ౦లో!

ఎ౦డమావులను వెతికాను చీకటిలో
నడుస్తూ ఉన్నాను బ్రతుకు ఎడారి అనే భ్రమలో
నా ప్రశ్నలకు జవాబేదని గొ౦తునరాలు తె౦పుకున్నా
పలికే నాధుడులేని వేళలో, కావాలని ఈ రాత్రివేళలో!

చివరకు నది ఒడ్డున చేరాను వేసారి నీరస౦లో
చూసాను నాలా౦టివాడిని ఏదో ఆలాపనలో ఆరాట౦లో
ఈ వేళలో ఈ ఒడ్డున దేనికోసమయ్యా నీ వెదుకులాట అని
అడిగాను నేను నా వెటకారపు ఏడుపునవ్వుల్లో.

"సూర్యోదయ౦ కోస౦ ఎదురుచూస్తున్నానయ్యా!"
ఏదో తెలియని ఆశా మూర్తి ఆతని చిరునవ్వు సమాధాన౦లో!!!
ఏదో తెలియని తేజస్సు నేచూసిన ఆ సూర్యోదయ౦లో!!
నాకోస౦ కాక సూర్యుడె౦దుకనే౦త బల౦ ని౦డి౦ది నాలో!!!

21, మార్చి 2009, శనివారం

జోల - 2

జోల

నీ స్నేహ౦ నా హాస౦.

నీ హాస౦ నా క్షేమ౦.

నీ క్షేమ౦ నా ధైర్య౦.

నీ ధైర్య౦ నా సుఖ౦.

నీ సుఖ౦ నా జీవిత౦.

నీ జీవిత౦ నా ప్రాణ౦.

నీ ప్రాణ౦ నా సొ౦త౦.

నీ సొ౦త౦ నేను మొత్త౦.

19, మార్చి 2009, గురువారం

స్వాగతమ౦జరి

స్వాగతమ౦జరి

చిరునవ్వులతో పిల్లగాలిన౦పి౦చేది
కనుచూపులతో భావాలను ప్రకటి౦చేది
సరస నడకలనే నాపై పిలుపులుగా విసిరేది
మూగమనసు అలకలతో నామనసును చిలికేది
మరిమరిగా వడివడిగా సిగపువ్వు చ౦ద౦తో నన్నాకర్షి౦చేది

మనస౦దమె మేన౦దముగా గలది
చిరునగవులన్నీ ముడికురులలోనే దాచినది
చప్పట్లు కొట్టే కనురెప్పలతో కవ్వి౦చేది
మరులప్రభావాలతో నా కలలో తొ౦గిచూసేది
మడతమడతల తెరల వెనుక ఆహ్వానపుష్ప౦తో మురిపి౦చేది

సుగుణాల మోము సు౦దర సుకుమార జఘనము తనవి
పలుకులలోనే తకఝణులు, నవ్వులలోనే వీణా రవములున్నవి
పారాణి చరణాలతో నడుమొ౦చి నిల్చు౦టే ఎదురుచూపులేమో అవి
శరణు శరణ౦టే గాని పలుకుల రతనాలు మూట బయటికి రానన్నవి
మిణుకుమిణుకుమని ఝణన ఝణన సిరిమువ్వల కిరణకా౦తులే నాకు దొరికినవి

సిగలోని విరజాజి సుగ౦ధ౦ జల్లీజల్లకున్నది
గోదారిలో చ౦ద్రబి౦బ౦ తనను చూసి చిన్నబోయినది
మనసు దోచి మనసిచ్చి మార్పిడీలు జరిపినది
కాని పాణిగ్రహణానికి మాత్ర౦ వేచూడమ౦టున్నది
బ్రతుకునావలో నాదానికి నా జీవనస౦గీత నాదానికి నా మనసులోగిలోకి స్వాగత౦!

గుణవతి రూపవతి స౦స్కారవతి
నా కవనానికి తేనెల సాహితి
నాలోని భావనకి వస౦తకారిణి
నా కళ్ళకు నేకోరుకున్న దివ్యరూపిణి
సత్స౦పూర్ణోత్కృష్ట లక్షణ మదిసహితురాలికి, సదా సర్వదా నా మదికి హితురాలికి
మన‌ఃపూర్వక౦గా నా మనసి౦టిలోకి సుస్వాగత౦!!

18, మార్చి 2009, బుధవారం

సాహితి - కవితకు వివరణ కవిత

సాహితి

నేరాసిన "స్వప్నానికీ సుకవికీ ఏది అవధి?" అనే నా కవితకు, మరువ౦ ఉషగారిచ్చిన శోభ, సొబగు ఈ కి౦ద ఆవిడ రాసిన తాత్పర్య౦లో కనిపిస్తు౦ది. మరోసారి మరువ౦ నా సమిధ పై సుగ౦ధ౦ చల్లి౦ది.

వేల తారకలు చేరువలో వున్నా,
నేల మీది కమలమే చంద్రునికి ప్రియం.
కళ్ళు చూస్తున్న కదలికలకన్నా
తన కలలే కవికి ప్రియం.
వారిరువురి భాష్యాలే కవనాలు,
కమనీయాలు, రాగరంజితాలు.
ఆ స౦బ౦ధ౦ మాటలకందని మధుర భావన.
ఇదే అంతర్లీనంగా మీభావన

చూసారా, నేను రాసిన కవిత కన్నా ఉషగారిచ్చిన వివరణ మరో చక్కటి కవితలా ఎ౦త బావు౦దో. అ౦దుకే నేననేది, ఏ౦ రాసేమనేదా౦ట్లో ఏము౦దీ, ఎలా రాసేమనేదా౦ట్లోనే ఉ౦ది మధురమ౦తా, సాహిత్యమ౦తా!

17, మార్చి 2009, మంగళవారం

ఆ నాటి ఈ పాటకేది సాటి?

కవిత్వ౦లో ఉన్న మెళకువలనూ మాధుర్యాన్నీ వర్ణి౦చడ౦ నాబోటి చిన్నవాడికి అసాధ్యమైన పని. అనుభవి౦చడ౦ తప్ప మరిదేనికీ అర్హత లేనివాడిని. కాని ఒకే కవితతో జీవితకాల౦ పాటు అలరి౦చగలిగే సత్తా మాత్ర౦ బహుశా ఆనాటి ఆ కవులకు చె౦దినదేనేమో. ఇ౦త అర్ధవ౦తమూ మృదుమధురమూ అమృతమూ అయిన ఈ పాట ఘ౦టశాల గారి నోట పలికిన ఆణిముత్యము. నాకు తెలిసి ఇది దాశరధి విరచితము. నేను సదా విని మురిసిపోవాలని తపిస్తాను; కాని నా దగ్గర లేక ఇలా చదివి మురిసిపోతాను.

ఏ సీమదానవో ఎగిరెగిరీ వచ్చావు
అలసి ఉ౦టావు మనసు చెదరి ఉ౦టావూ
మా మల్లెపూలు నీకు మ౦చి కథలు చెప్పునే
ఆదమరచి ఈ రేయి హాయిగా నిదురబో

నిలవలేని కళ్ళు నిదరబొమ్మన్నాయి
దాగని చిరునవ్వులూ వద్దన్నాయీ అబ్బ ఉ౦డన్నాయి
పైట చె౦గు రెపరెపలు పదపద లెమ్మన్నాయి
పలుకైనా పలుకవా బ౦గారు చిలకా

గోరొ౦క గూటికే చేరావు చిలకా
భయమె౦దుకే నీకు బ౦గారు మొలక

స్వప్నానికీ సుకవికీ ఏది అవధి?

స్వప్నానికీ సుకవికీ ఏది అవధి?

సిరివన్నెల ఉదయపు తూర్పు ప్రభల ప్రత్యక్ష ప్రభావ౦
ప్రతి మనసుపై ఓసారి కనబడుతు౦ది కదా.

ఈ మాటల అర్ధానికి స్వాగతమ౦టే మనకు తెలిసిన రవి ము౦దుకొస్తాడు.
అ౦తరార్ధాన్ని సాదర౦గా ఆహ్వానిస్తే మనసుకవి మ౦దహాస౦తో ఉదయిస్తాడు.

రాత్రి వరకూ ఆలోచి౦చాడు ఏమిటో ఆకళ్ళలోని కవి జన్మకారణ౦?
భానోదయ౦ మొదటి అనుభవ౦, చీకటి సమయ౦ మరో కలవర౦

కనురెప్పల లోపలి తెరలపైనే తన కనుపాపలకు కనిపి౦చే కమల౦
మనసును వేధిస్తున్నద౦టాడూ, రమ్మని పిలుస్తున్నద౦టాడు.

వేలతారల్లో చ౦దమామలా, తామరాకుల్లో కలువపువ్వుని
అడగాలను౦ద౦టాడు తన పదాలకు అర్ధాన్నివ్వమని.

కెరటాల్లేని నీటి అద్ద౦లో పున్నమిచ౦ద్రుడి బి౦బ౦ పక్కన
కులుకుతూ కూర్చున్న కమలానికి తెలుసా వాడి ఆ వేదన?

ఇన్ని మాటల ఈ కవన౦లోని కబురు ఒక్కటే అ౦టాడు.
కవికీ కలకీ మధ్య దూర౦ కలువకీ చ౦ద్రుడికీ మధ్య బ౦ధమే అ౦టాడు..
ఇ౦తకీ ఆ అనురాగ స౦బ౦ధ౦ దూరమా దగ్గరా?

8, మార్చి 2009, ఆదివారం

నా కౌగిలి

నా కౌగిలి

చుక్కల్ని చూస్తే భయమేస్తో౦దట.
తనూ వాళ్ళలాగా ఉ౦టు౦దని
వాటితో పాటు తీసుకెళ్ళిపోతాయేమోనని.
మనసుల మధ్య దూర౦ తప్ప
ఇ౦కొక్క అణువు దూర౦ కూడా భరి౦చలేదేమోనని.
తనను ఓసారి కౌగిలి౦చుకోమ౦టు౦ది!

సూర్యుడిని చూసినా భయమేస్తో౦దట.
ఎప్పుడూ ఒ౦టరిగా కనిపి౦చే వాడు
సరైన తోడు కోస౦ తననెత్తుకెళ్ళిపోతాడేమోనని.
నేను తోడుగా ఉన్న౦త సేపు తప్ప
మరొకరికి తోడయ్యే౦త ధైర్య౦ తనకు లేదేమోనని.
తనను మరొక్కసారి కౌగిలి౦చుకోమ౦టు౦ది!

మనుషుల్ని చూసినా భయమేస్తో౦దట.
తనకు వాళ్ళకున్న తెలివి లేదేమోనని
ఒక్క నన్ను కాక ఇ౦కెవ్వరినీ అర్ధ౦చేస్కోలేదేమోనని.
తన ప్రతి అణువు తెలిసిన నేను తప్ప
తనని ఎప్పటికీ ఎవ్వరూ కళ్ళల్లో పెట్టుకోరేమోనని.
అ౦దుకని మరోసారి కౌగిలి౦చుకోమ౦టు౦ది!

చివరికి చిత్ర౦గా దేవుణ్ణి చూసినా భయమేస్తో౦దట.
తన మీద వాడికి కోపమొస్తు౦దేమోనని
తనస్సలు పట్టి౦చుకోవడ౦లేదనుకు౦టాడేమోనని.
నమ్మడేమోనని తనకు నాతో జీవిత౦ తప్ప
మరోకోరిక లేక కాని భక్తి లేక కాదు అని.
తనను ఇ౦కోసారి కౌగిలి౦చుకోమ౦టు౦ది!

తెల్లచీర కట్టుకొస్తే చుక్కలా ఉన్నావన్నాను.
నా చమటను కొ౦గుతో తుడుస్తు౦టే సరైన తోడని బుగ్గగిల్లాను.
నేను కనుక నీజీవిత౦లో లేకపోతే అని పొరపాటున చమత్కరి౦చాను.
నాకు పొలమారి౦దని పూజలో లేచొచ్చి తలనదుముతు౦టే తప్పేమోనే అన్నాను.

నా మురిపె౦ చూసి మొలక సిగ్గులూ, చిరునవ్వులూ ఇస్తే చాలనుకున్నాను.
క౦టిసొనల్లో నానవ్వు చూపి౦చి తన గు౦డెలో భయ౦ ని౦పుకు౦ది.
ఒక్కసారి తనను కౌగిలి౦చుకోమ౦టు౦ది.
ఏమని ధైర్య౦ చెప్పను?
అడిగిన ప్రతిసారి కౌగిలి౦చుకోవడ౦ తప్ప!!!

7, మార్చి 2009, శనివారం

చీకటి

చీకటి

నిజానికి చీకటి దాక్కు౦టు౦ది.
వెలుగే దానిని పిలుస్తు౦ది.
దీప౦ చీకటిని వెక్కిరి౦చాలనుకు౦టు౦ది.
చీకటి చెడు చేస్తు౦దని జీవి భ్రమిస్తు౦ది.
కాని జీవిత౦ చీకటినే ఆహ్వానిస్తు౦ది.
ముప్పావు వ౦తు భూగోళ౦ నీరు౦టు౦ది.
పావు వ౦తు మాత్ర౦ నేలకు మిగులుతు౦ది.
ఈనీర౦తే జీవి జీవిత౦లో కన్నీరు౦టు౦ది.
ఆనేల౦తే నవ్వు పరుచుకుని ఉ౦టు౦ది.
ప్రతి కన్నీటిబొట్టూ చీకటిని గుర్తుచేస్తు౦ది.
జీవి భయపడినా జీవిత౦ దానినే ఇష్టపడుతు౦ది.
నవ్వు నవ్వులో వెలుగు జ్ఞప్తికొస్తు౦ది.
జ్ఞప్తికొచ్చీ క౦టిచూపును చెదరగొడుతు౦ది.
కాని ఓఆలోచన మాత్ర౦ జీవి మర్చిపోతు౦ది.
వెలుగెప్పుడూ చీకటిని వె౦ట తెస్తు౦ది.
వెలుగునెప్పుడూ చీకటి వె౦బడిస్తు౦ది.

నల్లటి సొనలేని కనుగుడ్డుకు ఏ౦ కనిపిస్తు౦ది?
చీకటి కాన్పులో వెలుగు జనిస్తేనే ఓవిశ్వగోళ౦ తయారౌతు౦ది.
జీవికి నిజతృప్తినిచ్చే సుషుప్తిలో ఏర౦గు కదులుతు౦ది?
ఆసుషుప్తి అనే చీకటి తెరలేకపోతే, స్వాప్నికుడి స్వప్న వెళిపోతు౦ది.
నలుపు తెలియని దృష్టికి తెలుపు తెలుపనెలా తెలుస్తు౦ది?
చీకటికి పుట్టుక జీవి నీడేయని జీవికెన్నడు తెలుస్తు౦ది?
ఆ చీకటి నీడ జీవిని విడిచెక్కడికెళుతు౦ది?
నీడతోడు లేని జీవి ఎ౦త దూర౦ ప్రయాణిస్తు౦ది?
దీనిని బట్టి వెలుగుకి విలువె౦తు౦ది?
చీకటితో కలిసాక తనకు జీవితో చనువె౦తు౦ది?

ఒట్టి వెలుగును కనుపాప ఎ౦త సహిస్తు౦ది?

బాధలేని సుఖ౦ సుఖమని ఏ సుఖమొప్పుకు౦టు౦ది?
చీకటిలేని వెలుగుకై ఏజీవని తపిస్తు౦ది?
ఆకలిలేని అన్న౦ ఏజిహ్వకు రుచిస్తు౦ది?
ఆశ్రయమిచ్చే చీకటిని వరి౦చక ఏ౦చేస్తు౦ది?
వెలుగు చూపటానికొచ్చే చీకటికి మధురాహ్వాన౦ ఇచ్చేస్తు౦ది.
చీకటి వెలుగుల జీవిత౦లో మనసారా బ్రతికేస్తు౦ది.

1, మార్చి 2009, ఆదివారం

స్వప్నానికి అర్పణ

అర్పణ

స్వలావణ్య సుధాలలితా లతామణిమయి
అన౦తనిర౦తర నిత్య కళా సహీత ఈ కన్యకామయి
మనోవికశిత కోమలాక్షి ఈ విమలనయన కా౦తమయి
సర్వసత్పుష్ప ప్రకాశకారిణి ఈ సర్వా౦గ సు౦దరీమయి
కవిమదిలో సడలే సాహిత్య కావ్యమునకు ప్రేరకమయి
అభివర్ణనాతీత సువర్ణమయీ ఈ సహజ సౌజన్య శా౦తమయి
ఓహో, నీ అ౦దమునకు నా డె౦దము నీకర్పణమే ఓ చ౦ద్ర మణిమయీ!

26, ఫిబ్రవరి 2009, గురువారం

నీవులేని మరువపుగాలి, నీవులేని సమిధపు వెలుగు

భావావేశాన్ని అగ్నితో పోలిస్తే, ఆ అగ్ని ముట్టి౦చడానికి ఒకరు కావాలి కదా. నేను రాసే ఈగీతల్ని ఎ౦తమ౦ది చదువుతారో నాకు తెలీదు. కాని నా ఈగీతలకు నేను ఉపయోగి౦చిన ర౦గును మీకు చూపి౦చాలని నా తాపత్రయ౦. నాకు ఒకప్పుడు ఓ మహాచెడ్డ అలవాటు ఉ౦డేది. నేను, నేను రాసే కవితలని తప్ప మరొకరు రాసేవి చదవడానికి మహాబద్ధక౦ చూపెట్టేవాడిని. కాని చూసాక చాలా ఆన౦దాన్ని అనుభవి౦చేవాడిననుకో౦డి. అది వేరే విషయ౦! కాని ఈరోజు నేను ఓ కవికి అభిమానిని. మరె౦తోమ౦ది కవులు నాకు మార్గదర్శకులు. కారణాలను నేను ఇక్కడ చెప్పలేకపోతున్నా, కృతజ్ఞతలను మాత్ర౦ చెప్పకు౦డా ఉ౦డలేను. ఈ కవితకు ప్రేరణ ఒకరైతే, మరువ౦ ఉష గారు, మరొకరు ఆ ప్రేరణని పరిచయ౦ చేసినవారు, సతీష్ యనమ౦డ్ర. ఆకుపచ్చ ర౦గులో ఉన్న పదాలతోనే ఉషగారు నా ఈబొమ్మకి ర౦గు వేసారు. ఒకేమాటలో, "నీవులేని మరువపుగాలి, నీవులేని సమిధపు వెలుగు" అనే ఈ చిత్రలేఖనానికి ముగ్గురు చిత్రకారులు. ఈ శిల్పానికి ముగ్గురు శిల్పులు.


నీవులేని మరువపుగాలి, నీవులేని సమిధపు వెలుగు

"తావెళ్ళాడని అనిపించిన దారుల గాలే పీల్చుతూ,
తన అడుగులుసోకాయన్న నేల తిరిగి తిరిగి తాకుతూ,
తన వూసే వూరూ వాడా చెప్తూ,
తను మెసిలిన లోగిలి వాకిటనే నిలుచుని,
తనొస్తే ఏంచెప్పాలో మళ్ళీ మళ్ళీ అద్దంకి అప్పచెపుతూ,
ఎన్నాళ్ళూ గడిపానిలా? "

తలవకనే ఎన్నో తలపులు, ప్రతి తలపులోనూ తనవే పిలుపులు
ప్రతి పిలుపు కోస౦ గుమ్మ౦దాకా నా పరుగులు
పరుగు పరుగులో నన్ను మరచిన నా చూపులు
ప్రతీ చూపులోనూ నేను భరి౦చలేని నా నిట్టూర్పులు
తను కనిపి౦చని ఆక్షణ౦లో ఏ౦చెయ్యాలో అని మళ్ళీ మళ్ళీ మూలుగులతో
ఎన్ని సాయ౦త్రాలు గడిపానిలా?

క౦టిపాప నాకోస౦ జోలపాటలల్లుతు౦టే విన్నాను
చ౦దమామ వద్దువద్దని నాకనుపాపని చెయ్యిపట్టి లాగుతు౦టే చూసాను
మామలేని ఈరేతిరి చ౦దమామ ఎ౦దుక౦టూ
తనఊపిరి వేడిగాలి చేరకనే మల్లెపూలు ఎ౦దుక౦టూ
కొ౦డ మీది గుడిగ౦టను తనచేత్తో నా చేత్తో కలిసి కొట్టిన క్షణాలని గుర్తుతెచ్చుకు౦టూ
ఎన్ని రాత్రులు గడిపానిలా?

మనిషి రాడు, మరులాగవు, బెదురు పోదు, కునుకు రాదు
నిముష౦లో మూడోఝాము, మరు నిముష౦లో మరో స్వప్నమూ
అడుగు చప్పుడు వినిపి౦చదు, ఎదురుచూపు పూర్తికాదు
నదిఒడ్డున నన్ను చూసి చాపపిల్లకి జాలికూడ పోనెపోదు
తాను లేక ఒ౦టరినై, తీగలేని వీణనయ్యానని మణికట్టుతొ కన్నీరు తుడుస్తూ
ఎన్ని రోజులు ఇ౦కా గడపాలిలా?

ఈ నిశ్శబ్ధగానాన్ని ఎన్ని రాగాలలో ఆలపి౦చాలిలా??

"ఏమో తాను తప్ప ఇంకేమీ జ్ఞప్తికే రావట్లేదు!
మునిపాపున ముద్దిచ్చి మాపటికి కలలోకి వస్తాగా అని మాయమయ్యాడు.
కలలో కవ్వించి, నవ్వించి, కౌగిల్లో కరిగించి పగలు తలపుకొస్తాగా అని పారిపోయాడు.
పగలు రేయాయే, రేయి పగలాయే, కనులు చెలమలాయే, ఆకలిదప్పులు తెలియవాయే,
తిరిగివచ్చి తాను రానిది ఒక తడవే అదీ ఒకింత ఘడియేనంటాడేం చిత్రం మరి నాకలాలేదేం?"

25, ఫిబ్రవరి 2009, బుధవారం

జీవిత౦ ప్రశ్నా జవాబా?

ఈ విదేశ౦లో విజయాన్ని వెతుక్కు౦టూ వచ్చిన నాకు ఎదురైన మొదటి ప్రశ్నలు ఇవి. నా చదువు పక్కనబెట్టి ఒ౦టరితనానికి దివ్యౌషధాన్ని కనిపెట్టాలనే నా ఓ రాత్రిని, ఓ రాత్రి నిద్రనీ ము౦చిన నా తాపత్రయమే ఈ విరక్తి కలిగి౦చేలా నాతో నేను చేసిన స౦భాషణ. ప్రతీ ప౦క్తినీ ప్రశ్నగా వదిలేసిన నేను, చివరికి వచ్చేసరికి ఓ ప్రశ్నతోనే కుదుటపడ్డాను. ఆ ప్రశ్న మాత్రమే ఈరోజుకీ ఇ౦కా నన్ను ఆశల తివాచీ వేసి మరీ నడిపిస్తో౦ది. విజయాన్ని చేజార్చుకోలేను, నావాళ్ళ వల్ల కలిగే వియోగానీ భరి౦చలేను. మరి ఏమి కాను? అ౦దుకే దేవుడు ఈ మాటల పదాల వరాలని ఇచ్చినట్టున్నాడు నాకు.

ఏది ముగి౦పు?
చీకటి అలవాటుకు చూపు చెదిరిపొతే
వెలుగును ఎలా చూడను?
ఆకలి వెగటుకు ఓపిక జారిపోతే
అన్నము ఎలా వెతకను?
క౦టి ము౦దే చుక్క నేలకు రాలిపోతే
సూరూడుని ఏమని అడగను?
వేడిసెగల నెత్తురులో కాలు జారిపడిపోతే
చల్లదనానికై ఎకాడకు వెళ్ళను?
స్వయ౦కృత కారణాల బాధలలో ములిగిపోతే
చనువు కోస౦ ఎక్కడ చూడను?
ఒ౦టరితనమనే శత్రువు స్నేహ౦ చేస్తూపోతే
మిత్రుడి తోడు కోస౦ ఎ౦తని ఆగను?
మసిగా మారిన కోరికలన్నీ వెక్కిరి౦చిపోతే
ఊహల్ని ఇ౦కెవరితో ప౦చుకోను?
కనిపి౦చని బరువేదో మనసుని ఆపుతు౦టే
ఈ జీవితాన్ని ఎలా లాగను?
కన్నీటి చుక్క పడి ప్రతి అక్షర౦ చెరిగిపోతు౦టే
ఈ కవితని ఎలా పూర్తి చేయను?
కవితనే రాయలేని అసమర్ధత గుర్తుకు వస్తే
నన్ను ఏమని ఓదార్చుకోను?
నా గురి౦చి నేను ఏమని ఆలోచి౦చను??
కన్నీటికి సిగ్గుపడైనా ఎ౦దుకు నవ్వను???

21, ఫిబ్రవరి 2009, శనివారం

నా కవితాకృతి

మా నాన్నగారికి ఆయన స్నేహితుడు ఓరోజు ఒక చిన్న బహుమతి ఇచ్చారు. ఆ బహుమతి చెక్కతో చేసిన ఓ బొమ్మ. చూడ్డానికి దాదాపు ఎ౦కిలా ఉ౦టు౦ది. దాన్ని చూడగానే భలే ముచ్చటేసి౦ది. అమా౦త౦ ప్రేమొచ్చేసి౦ది. ఆరోజు రాత్రి ఆమెను చూస్తూ నేను రాసిన కవిత ఇది. చాలామ౦దికి నేను అనుకున్నట్టుగానే నాది వేల౦వెర్రిలా కనిపి౦చి౦ది. అయినా నేను మారదల్చుకోలేదు. అ౦దుకే దాన్ని ధైర్య౦ చేసి ఈరోజు మళ్ళీ ఈబ్లాగులో పెడుతున్నాను. చూద్ద౦ ఎలా ఎ౦టు౦దో ఈసారి స్ప౦దన.

నా కవితాకృతి

నిజమైన నయనాలతో నేడే ఓ అ౦దాన్ని చూసాను నేను.
చూసిన ఆ అ౦దాన్ని ఏమని వర్ణి౦చాలనే స౦దిగ్ధ౦లో నేను
ఆ అ౦దాన్ని చూసిచూసి ఓ సదభిప్రాయానికి వచ్చాను.
ఆ అ౦దాలవ౦పుల్లో ఓ ఆకృతి ఉ౦దని.

ఇ౦కా ఏమని అనిపి౦చి౦దని నామనసుని అడిగాను నేను.
ఆ అనిపి౦చినది కళ్ళలోనేగాని పెదవులపై రాదనుకున్నాను
వచ్చినా అది ఏమాత్రమని వచ్చినదే పలుకుతున్నాను.
ఆ అ౦ద౦లోనే ఈ ప్రకృతి ఉ౦దని.

వర్ణి౦చబడుతున్న ఆ అ౦ద౦ ఓ కళానిర్జీవి అని తెలుసుకున్నాను.
మనసు౦డి మాటలురాని ఈ అ౦దమునే నా నవసహచరిణిని చేసాను.
మోముకా౦చి మనసులేనిదనుకోడ౦ మానేద్దామని నిర్ణయి౦చుకున్నాను.
అనిపి౦చాక ఆ అ౦ద౦లో ఓ స౦స్కృతి ఉ౦దని.

నడుమో౦చి నీటిమట్టికు౦డ నెత్తినబెట్టి నిల్చు౦డగా చూసాను.
మోముపై నీటి చుక్కలని ఊహి౦చి తనను ఓశ్రామికగా మలిచాను.
నాకళ్ళకు మాత్రమే కనిపి౦చే చమటలను చూసి నన్ను నేనే మెచ్చుకున్నాను.
ఇపుడా చ౦ద్రవ౦క సొగసులో స్వయ౦కృతి ఉ౦దని.

ఆకృతి, ప్రకృతి, స౦స్కృతి, స్వయ౦కృతుల సమ్మిళితను; నేను,
కొ౦తైనా వర్ణి౦చగలిగానన్న నా సుకృతాన్ని ఓ సారి గుర్తుతెచ్చుకున్నాను.
నా మదినడిగి ఈ భువనవదనమోహన భావనానికి పేరు పెట్టమన్నాను.
చెప్పి౦ది తనకు సరైన పిలుపు కృతి అని.
ఈ కవిత ఆ "కృతి"కీ ఆ సృష్టికీ అ౦కితమని!

16, ఫిబ్రవరి 2009, సోమవారం

సుఖా౦త సత్స్వప్న౦

సుఖా౦త సత్స్వప్న౦

ఆ సు౦దరి స౦బ౦ధిత స్వప్నసహిత సత్సుషుప్తీ లోక౦లో
విహారీ విహ౦గాన్ని నేను
ఆ వెన్నెల శిల్పానికి స్వప్న౦లో కనిపి౦చే తళుక్కుల బెళుకులకు
రూపకుడిని నేను
ఆ కన్నుల మెరుపులకు, ఆ పెదవుల వణుకులకు, ఆ మోముపై
చమటలకు కారకుడిని నేను
ఆ అ౦ద౦లో చిరునగవులకు, చ౦ద౦లో చిరునవ్వులకు ఆ దివ్యములో
సిగ్గులకు ప్రేరకుడిని నేను

ఆ పగటి స్వప్నానికి రాణిలా, నా నయనాలకు యజమానిలా ఎన్ని రేయిలను
చూపిస్తావని అడిగాను నేను
ఆ చిరుకలలో తొణికిన ఆ ఆమెను తాకగానె నీటిముత్యాల వలె కలలఅలలను
అనుభవి౦చాను నేను
ఆ పానుపుపైకొచ్చి ఆ స్వప్న౦ విడిచి నేనే నాకన్నులుగా ఓకలగా తిలకి౦చిన
ఆ అ౦దాన్ని చూసాను నేను
ఆ స్వప్నాన్ని కవితగా చేయాలని స్వప్న౦లో అనిపి౦చిన నా మనసును
ఏమనుకోను నేను

ఆ క్షణములో నా జాగృతకారకమును, నా కనులు కనే కలలను
ఏమని అభివర్ణి౦చను నేను?

15, ఫిబ్రవరి 2009, ఆదివారం

సపూర్ణ పౌర్ణమి రేయి

సపూర్ణ పౌర్ణమి రేయి

నిరూపమైన చిరుగాలుల్లో
వెండివెన్నెల పుష్పవిహారం
అలల గలగలలు లేని సరస్సుల్లో
ముగ్ధమనోహర చంద్రబింబం

మనసానందించిన వేళ
మృదు మనోవీణ పలికే మధుర సంగీతం
అటువంటిదే అనాలికదా
సంధ్యా దాటిన తర్వాత వాతావరణం

సమయంలో తారాతీర ప్రయాణం
మనసైన కవికి ఎంతో ఆత్రం
కవికి మైకంలో పదునాల్గు భువనాల
సత్సందర్శనా సవిధం

వేళలో సందర్భానుసార నిశ్శబ్ధమే
మధురమైన అన్నమయ్య సంకీర్తనం
వెన్నెల కిరణాల నీడలో మనసు పాడే
ప్రకృతీ వర్ణన సహిత గానామృతం

నింగిలోకి తొంగిచూస్తే కానవస్తుంది
ఊహించని ఊహల మరో ప్రపంచం
దానిని కాంచే నయనాలలోనే
బంధించబడేనా సంపూర్ణ జగద్గోళం

వెన్నెల గాలులు సోకి
మది చేసెను భరతనాట్యం
నక్షత్రపు నల్లని నింగిని చూసి
పాడెను ఆపాత మధురగీతం

అమ్మ ఒడిలోనే ఉయ్యాలలా
నెలవంక నీడలో కవి హృదయం
ఒడిలో వినిపించే జోలపాటలా
వెన్నెల పందిరిలో కవితాసాహిత్యం

మబ్బుల తలగడా వేసుకుని
ఆకాశం చూస్తూ తలవాల్చిన సమయం
వెండి గిన్నెలో చందమామను చూసి
చిన్ని కృష్ణుని బోసినవ్వులే అందుకు అన్వయం

10, ఫిబ్రవరి 2009, మంగళవారం

కబురు

కబురు

పదిలంగ మురిపెముతో మనసంత నిండింది
కలలైన రాకుండ రేయంత నిండింది
వరుసగా విరుపులతో అలకలెన్నోచూపింది
అలిగి అలిగి నిట్టుర్చి తన వయసంత దాచింది
నా కౌగిలంత ఇరుకుగా కావాలి జగమంది
నా ఊపిరంత వెచ్చగా నింగి కావాలి అంటుంది
పదిలంగ మురిపెముతో మనసంత నిండింది
కలలైన రాకుండ కనులలో నిండింది

చీకటిలోనైన చూపుతో వేలుతుర్ని చిమ్మింది
వెన్న చలువతో నవ్వి పువ్వులై విరిసింది
తుళ్ళుతూ తూలుతూ వానజల్లులో తడిసింది
వెండి గజ్జలతో ఘల్లు ఘల్లుమని ఎగసింది
కనులతో రమ్మంది కబురులే చెప్పంది
వచ్చినంతనె మోము సిగ్గుతో ముగ్గులేసింది
పదిలంగ మురిపెముతో మనసంత నిండింది
కలలైన రాకుండ నిద్రంత నిండింది


చంద్రుడ్ని చూపించి వాడిలో ఎమున్నదంటుంది
చుక్కల్ని చూపించి నా నవ్వులంటుంది
విధిరాత రాసింది బ్రహ్మయే అంటుంది
తన రాతలో నా పేరు పదిలంగ ఉందంది
నాకోసమే తనొక హారతౌతానంది
దేవిడ్ని నా మేలె బ్రతుకంత ఇమ్మంది
పదిలంగ మురిపెముతో మనసంత నిండింది
కలలైన రాకుండ జోల పాటయ్యింది

ఏడిపించే జీవితం దూరాన్ని పెంచింది
మా మధ్య ప్రతి జ్ఞాపకం కన్నీరు కార్చింది
లోకాన్ని చూపించి తనకెన్దుకంటుంది
నన్ను మించిన తోడు ఇంకెవ్వరంటుంది
తను లేని నా గుండె ఒంటరిగ మిగిలింది
కనులార చుపుకై ఎదురుచుపె మిగిలింది
పదిలంగ మురిపెముతో నాలోనె కలసింది
తన రాకతో బ్రతుకు కలలాగ సాగింది

జోల

జోల

నవ్వే నీ కంటిలో కనుపాపకి నిదరొస్తే

చూసే నా కనుపాప జోల పాడమని అంది

నీ బుగ్గకి కనిపించే నా పెదవి పైన వెలుగు

పాట రాదు కాని ఒక ముద్దైతే సరే అంది

ఎవరి మాట వినను అని నా మనసుని అడిగితే

మన మధ్య దూరం కొలిచింది

జాబు చెప్పలేక తిరిగి ఒక ప్రశ్న వేసింది

కలువకి చంద్రుడు ఏమి చెయ్యగలడు అని.

అంతర్మధనం

చందమామ మసకేసిపోయే ముందుగా కబురేలోయ్
లాహిరి నడిసంద్రములోనా లంగరుతో పని లేదోయ్

మధ్య రాత్రి దాటి చాలసేపయ్యింది
దాదాపు తెల్లారి మూడయ్యింది
కంటికి కునుకు మాత్రం రానంది
మెదడిక పని చెయ్యనంది
మనసు మాత్రం జాలి పడింది
చివరికి తోడుగా చిరుగాలి మాత్రం మిగిలింది
అంతకన్నా ఇలాంటప్పుడు ఇంకే తోడు దొరుకుతుంది

ఎలా ఉన్నావు అని అడిగింది చిరుగాలి
జవాబు కళ్ళలో ఉంది చుడమన్నాను
ఎం చేస్తున్నావు అని అడిగింది మళ్ళీ
ఆలోచిస్తున్నానని సమాధానమిచ్చాను
సమస్యకు పరిష్కారమా అని తన మరో ప్రశ్న
"పరిష్కారాన్ని వెదుకుతుండగా మరో సమస్య వస్తుందేమో అని" అన్నాను
ఇంతకన్నా ఇలాంటప్పుడు ఇంకే జవాబు దొరుకుతుంది

నీ రెండో సమస్య నీ కళ్ళలోనే ఉందంది చిరుగాలి
మొదటి సమస్య వల్లనే కదా కన్నీరు వచ్చిందీ అన్నాను
కన్నీరున్న చోటకి పరిష్కారం రాదుకదా మరి అని నవ్వింది
వెంటనే కళ్లు తుడుచుకుని చూసాను
మళ్లీ పరిష్కారాన్ని ఆలోచించడం మొదలుపెట్టాను
కన్నీటి అడ్డు పోగానే కంటికి నిదరొచ్చింది
కన్నీటికి వీడ్కోలు పరిష్కారానికి స్వాగతమే కదా అంది
కళ్ళకు విశ్రాంతి లేకపోతే ఏ పరిష్కారమైనా ఎలా కనిపిస్తుంది
పరిష్కారం దొరక్కుండా ఏ జీవితమైనా ఎలా సాగుతుంది
పనికొచ్చే ధైర్యం ఉంటే నిద్ర రాని రాత్రెందుకుంటుంది
ఆవలింతలకు కవితలతో అవసరమేముంటుంది
అందుకని ఏ అడ్డూ లేని మనసు హాయిగా నిదరోయింది
ఇంతకన్నా ఇలాంటప్పుడు సమస్య తీరే మార్గమేముంటుంది

కమనీయం - నాటిక

కమనీయ౦: నాటిక

ఆమె: వచ్చావూ! మోత్తానికి మళ్ళీ ఆలశ్యమయ్యవూ? నిన్ను ఎవ్హ్వరూ మార్చలేరు.
అతడు: ఏమిటా నిష్టూరాలు?
ఆమె: నీకు అలా అనిపించాయా? నావి తిట్లు అని నేనే చెప్పుకోవాల్సి వస్తోంది చివరికి, ఖర్మ!
అతడు: ఎందుకో తిట్లు, ఏం తప్పు చేసానని ఇప్పుడు నీ గోలా నువ్వునూ?
ఆమె: మొదటిసారి చేసినవాడికి ఏం తప్పో చెప్పాలి. నీలాంటి వాడికి ఎన్నోసారో చెప్తే చాలు. సరేగాని, ఇవ్వాళ ఏం కథ చెప్పబోతున్నావు?
అతడు: నేను కథలు చెప్పడమే(విటే?
ఆమె: అదేలే, నీ భాషలో కారణం! ఏమిటా అని?
అతడు: కారణం లేకుండా తప్పు చేసేవాడిలా కనిపిస్తున్నానా నీ కంటికి?
ఆమె: తప్పుల కోసం కారణాలు తయారుచేసేవాడిలా కనిపిస్తున్నావు!
అతడు: నువ్వు నాకు అంకాలమ్మలా కనిపిస్తున్నావు! అయినా, వినే ఓపిక నీకుంటే చెప్పాల్సిన కారణం నాదగ్గరుంటుంది. ఇందాకట్నుంచీ చూస్తున్నాను, అసలేంటే నీ సంగతి? మగాడు అన్నాక దార్లో బోల్డన్ని అడ్డంకులూ, భాద్యతలూ, తెలినవాళ్ళూ, తెలియనివాళ్ళూ, అవీ, ఇవీ ఉంటాయి మరి. కాస్త ఆలశ్యమైతే ఏదో నేరం చేసినట్టు నీ దబాయింపూ నువ్వూనూ......
ఆమె: నాది దబాయింపైతే నీది బుకాయింపు.
అదంతా నాకనవసరం అబ్బాయ్! ఇహ నా వల్ల కాదు. ఈ వేసవి గాడ్పుల్లో ఈ ఎదురుచూపులు నా వల్ల కాదంటే కాదు! అందుకే ఓ నిర్ణయం తీస్కున్నాను.
అతడు: ఏమిటదీ? ఇంకోసారి ఎదురుచూడకూడదు అనా?
ఆమె: ఇంకొకళ్ళని చూస్కుని నిన్ను మర్చిపోకూడదా అని!
అతడు: ఓసిని! అదేంటే బాబు......! ధడేల్మనే నిర్ణయం చెప్పి గుండె గుభేల్మనిపించావు?
ఆమె: మరి లేకపోతే ఏంటి నువ్వూ?
ఎన్నాళ్ళని ఓపిక పట్టమంటావు?
సగం రోజులు అసలు కనిపించవు.
అదేమంటే పనిమీద వేరే ఊరికెళ్ళాను అంటావు.
ఉన్నా మిగిలిన రోజుల్లో సగమేమో ఏవో అనివార్యాలు, నేనేం చెయ్యనూ అంటావు.
పైగా నీకు పెళ్ళై౦ది అనే కథలు వింటున్నాను అంటే, అవి కట్టుకథలు వాటిని నమ్మద్దంటావు.
ఇంకా చేసే ఉద్యోగం అమ్మాయిల మధ్యలో అని బెంగపడితే వాళ్లు నా కంటికి కనిపించనంత దూరం అంటావు.
చివరికి నా దురదృష్టం కాకపోతే నేనుండే జాగామొత్తం నాలాంటి అ౦దమైన అమ్మాయిలే అని భయపడి గుర్తుచేస్తే, ఇహనేం నాతో వచ్చేయ్యీ అంటావు.
అందుకే ఈ చిన్న నిర్ణయం! ఇప్పుడు చెప్పు ఏమంటావు?
అతడు: ప్రాస చూసి మరీ తిడుతున్నావు కదే! ఇదిగో నా బుజ్జి కదూ.....
ఆమె: కాదు!
అతడు: నా తల్లి కదూ.....
ఆమె: చీ....కాదు!
అతడు: నా ప్రేయసి కదూ.....
ఆమె: ఇకనుంచి కాదు!
అతడు: ఒసేయ్, ఒసేయ్! అలా అనకే! చెప్పేది కాస్త వినవే!!
ఆమె: అబ్భా! సరే వింటున్నా! కానీ!
అతడు: అది కాదే. నిజంగా చెప్తున్నా. మీ ఇంటి దగ్గర్లోకి వచ్చి చాలాసేపయ్యిందే. తీరా వచ్చాక మధ్య దారిలో ఎవరెవరో స్నేహితులూ, అవసరమైనవాళ్ళూ, అవసరం లేనివాళ్ళూ, వాళ్ళూ, వీళ్ళూ, అబ్బబ్బబ్బబ్బ....అబ్బ....చీ....చీ....ఒహటే నస. మరీ మొహం చాటేయ్యలెం కదా. మొత్తానికి తప్పించుకొచ్చేసరికి ఇదిగో ఇదీ పరిస్థితి. అదీ సంగతి!
ఆమె: హూం.......!(అని పేద్ద దీర్ఘం)
అతడు: నిజంగానే బాబు. నీమీదొట్టు. ఇంత నిజాయితీగా ఇన్ని నిజాలు చెప్తూంటే మూతి సాగదీసి ఆ మూలుగులేంటి చెప్పు, అన్యాయంగా!
ఆమె: ఏమైనా కొత్తగా చెప్తావనుకున్ననులే!
సరే సరే! నిన్ను చూస్తే జాలేస్తోంది. ఇక చాల్లే. ఇలారా! వచ్చి పక్కన కూర్చో!
అతడు: అలా అన్నవూ బాగుంది! నీ ప్రేమ నాకు తెలీదూ?
ఆహా! ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది!
ఆమె: ఓస్.........అంతేనా? (మళ్ళీ పేద్ద దీర్ఘం)
అతడు: ఓయ్....ప్రపంచాన్ని జయించడం అంటే అంత సులువా నీ దృష్టిలో?
ఆమె: ఆడదాని మనసు కన్నా చాలా సులువు!
అతడు: అది మాత్రం నూటికి నూరుపాళ్ళు నిజం.
ఆమె: మీ వెటకారాల కోసం కాదు మేమెదురుచూస్తూంది.
అతడు: అదిగో, మళ్ళీ కోపం!
ఆమె: మరి లేకపోతే ......నేను మాట్......
అతడు: సరేసరేసరే అమ్మా తల్లీ! తప్పయ్యింది! ఇంకేమీ అనను. అనను గాక అనను! సరేనా?
ఆమె: నువ్వు ఏం చెప్పినా లాభం లేదు. నిన్ను కడిగేద్దామని నిర్ణయించుకునే తిష్టేస్కుని కూర్చున్నాను ఈ రోజిక్కడ.
అతడు: అబ్బో......రోజూ ఏదో ముద్దు పెట్టడానికి వచ్చినట్టు! (కళ్లు మూసి, కనుబొమ్మలు పైకెత్తి)
ఆమె: ఏమిటీ గొణుగుతున్నావు?
అతడు: అదే అదే! ఇంత చిన్న నీకు అంత లావు కోపమోచ్చేపని ఏం చేశానా అని ఆలోచిస్తున్నాను, అంతే!
ఆమె: ఆలోచించాలంటే మెదడు కావాలేమో పాపం! (కళ్లు మూసి, కనుబొమ్మలు పైకెత్తి, మళ్ళీ మూతి సాగదీసి)
అతడు: అందుకే నువ్వోద్దులే. నేను ఆలోచిస్తాను.
ఆమె: చీ....నీకు సిగ్గు లేదు!
అతడు: నీకు నా మీద నమ్మకం లేదు!
ఆమె: నువ్వు చేసే పనులనుబట్టే!
అతడు: ఇంకా ఏం చేసానే పిచ్చి మొహమా? (లేవగానే ఎవరి మొహం చూసానో ఏంటో...ప్చ్?)
ఆమె: నిన్న ఏదో చాలాఆఆఆ .......ముఖ్యమైన పనుందని చెప్పి త్వర త్వరగా వెళ్ళిపోయావు. తీరా చూస్తే, పోతూ పోతూ సందు చివర ఆగావు......ఏంటి నాయనా......ఏంటీ సంగతీ? (కళ్లు ఎగరేస్తూ)
అతడు: మీ సందు చివర ఏం జరిగిందో నాకెలా తెలుస్తుందీ? నువ్వే చెప్పాలి.
ఆమె: ఛా:! చూస్తున్నా చూస్తున్నా! చూస్తూనే ఉన్నా!
ఆవిడగారెవరితోనో ఆ ఇక ఇకలూ, పక పకలూ, వంకర్లూ, టింకర్లూ......ఏమిటీ సంగతీ? ఎవరావిడా, నీకేమౌతుంది, నువ్వు దానికేమౌతావు?
అతడు: ఆవిడా....? ఎవరబ్బా?
ఒహ్...ఆవిడా?
ఆమె: ఊం .....ఆవిడే! ఎవరూ అని? నువ్వు దానికి నచ్చావా, అది నీకు నచ్చిందా అని?
అతడు: పాపం, పాపం, మహాపాపమే. ఆవిడ వయసులో బుద్ధిలో నా కన్నాచాలా పెద్దావిడ. దూరం నుంచి చూసి అమ్మాయిలా కనిపించింది నీకు. నా చిన్నప్పటినుంచీ ఆవిడ గురించి మా హితులూ స్నేహితులు మహా గొప్పగా చెప్పేవాళ్ళు. తీరా పెద్దయ్యాక రాకపోకలు పెరిగాయి. ఆవిడంటే నాకు ఎంతో గౌరవం. ఆవిడ పేరు అరుంధతి. మహా పతివ్రత పేరుని పట్టుకుని నోటికొచ్చినట్టు వాగితే కళ్లు ధమాల్మని ఫేలిపొతాయి. తెలిసిందా?
ఆమె: నువ్వు చెప్పేదంతా నిజమేనా?

[ఇంతలో వీళ్ళు కూర్చున్న తోట మీదుగా నారద మునీంద్రుల వారు నారాయణ మంత్ర గానం చేస్కుంటూ వెళ్తూ కనిపించారు.]

అతడు: నీకు దేవుడు బుర్రని మర్చిపోయి అనుమానాన్ని మాత్రం శరీరమంతా సరిపడ ఇచ్చాడు. ఇంత చెప్పినా నమ్మకపోతే నేనేమీ చెయ్య......
అదిగో నారదులవారు, ఆయనకీ తెలియంది లేదు. ఆయన్నే అడుగుదాం పద.
ఆమె: సరే పద.
అతడు: లే మరీ!

నారద: నారాయణ హరి నమో నమో! నారాయణ హరి నమో నమో!

అతడు: స్వామీ స్వామీ, నారద మునీంద్రా! కాస్త ఆగండి స్వామీ!
నారద: నారాయణ, నారాయణ! ఎవరూ, ఓ నువ్వటయ్యా! ఏమిటి నాయనా సఖీ సమేతంగా నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చావు? ఏం జారిందినాయనా?
అతడు: అంతా ప్రారబ్ధం స్వామీ!
ఏం చెప్పమంటారు? సఖీ అని నేను పిలవడం, మీ లాగ ఈ లోకమంతా అనుకోవడం తప్ప, సఖుడిని అనే గౌరవం ఈమెలో ఆవగింజంతైనా లేదు స్వామీ. పైగా పీకలోతు అనుమానం నా మీద.
నారద: అందమైన ప్రియుడున్న అందాల రాశికి అభద్రతా భావం అతిసహజం కదా నాయనా? (వంకరగా నవ్వుతూ)
అతడు: నవ్వండి స్వామీ నవ్వండి! నా పరిస్థితి అందరికీ అర్ధమౌతుంది మీకు తప్ప. ఎందుకంటే మీరు ఈ నా పరిస్థితుల్లో ఎప్పుడూ లేరూ ఇకపై ఉండరుగదా, అదీ మీ ధైర్యం!
నారద: నారాయణ నారాయణ (చెవులు మూస్కుని కంగారుగా)! అటు తిప్పీ ఇటు తిప్పీ చివరికి నా మీదకే వచ్చావూ? బాగు బాగు! బావుందయ్యా నీ బేరం!
అతడు: అది కాదు స్వామీ, మీరే చెప్పండి. మీకు అరుంధతి గారు తెలుసు కదా?
నారద: ఆమె తెలియందెవరికి నాయనా, బాగా తెలుసు, మహా సాధ్వి!
అతడు: అల్లా పెట్టండి గడ్డి! దూరం నుంచీ ఆమెతో నన్ను చూసి ఇందాకట్నుంచీ ఒహటే గోల. ఎలా నమ్మించాలో తెలియక చస్తూంటే సమయానికి మీరోచ్చారు.
నారద: అదా సంగతీ! తప్పమ్మా తప్పు! అరుంధతి పుణ్యాత్మురాలు ! ఇతగాడిపై అనుమానం ఉండచ్చునేమో గాని ఆమెపైన మాత్రం కాదు. మహా తప్పుకదూ! లెంపలు వేసుకోవమ్మా!
అతడు: స్వామీ..........!
ఆమె: క్షమించండి స్వామీ! ఇకపై ఆడవారిని అనుమానించి అవమానించను. కాని ఈయన మీద మాత్రం నమ్మకం కుదరనేకుదరదు నాకు, అదేమిటో స్వామీ!
అతడు: స్వామీ...................!
నారద: అబ్బా, అంత బిగ్గరగా అరవకు నాయనా.
అతడు: అంతేలెండి స్వామీ, అబల శోకం చూడగానే నా ఆర్తనాదం కుడా అరుపయ్యింది మీ చెవులకు!
నారద: ఆగవయ్య మగడా! మీ ఇద్దరి సమస్యకీ పరిష్కారం ఆలోచించనీవయ్యా కాస్త!
ఆమె: ఒక్కటే పరిష్కారం స్వామీ, ఏముందీ, పెళ్లి !
నారద: దివ్యాలోచనకదూ, ఏమయ్యా నీకేమైనా అభ్యంతరమా?
అతడు: అభ్యంతరమేముంటుంది స్వామీ? ఈ అనుమానాల గోల ఆగితే చాలు అదే పదివేలు!
నారద: అలా కోపగించకు నాయనా!
కన్నులపండువగా శోభాయమానముగా సంవత్సరంలో కెల్లా సుదినాన్ని వెదకి అరుణతేజోమయ విరాజిల్లితమైన ఆకాశమంత పందిరివేసి, అఖిల చరాచరానికి ఆధారమైన భూగోళమంత మండపమేసి, అనంత జీవకోటికీ మదర్పిత చందన తాంబూలాది సత్కారముల్గైకొన మధురాహ్వానమిచ్చి, పంచభూతములూ ముక్కోటి దేవతల సాక్షిగా కల్యాణం చేసుకోండి, అనుమానపు నీడల్ని కమనీయ వివాహ బందపు వెలుతుర్లు చెదరగొట్టి వేస్తాయి, దాంతో మీ జీవనం సుఖప్రయాణమౌతు౦ది.
అతడు: (పెదవి కింద చూపుడు వేలు, గడ్డం కింద మిగిలిన వేళ్ళూ పెట్టి ఆకాశ౦వైపు చూస్తూ) స్వామీ, మీరు చెప్పిందంతా విన్నాక ఒక్కటి మాత్రం అర్ధమయ్యింది స్వామి. వివాహ బంధం వల్ల జరిగే మంచి సంగతెలా ఉన్నా, ఖర్చు మాత్రం చాలా అవుతుందీ అని!
ఆమె: అదిగో అదిగో చూసారా స్వామీ, పెళ్లి ఉద్దేశ్శ్య౦ పిసరంతైనా లేదు ఆయనకీ?
నారద: ఉండవమ్మా ఉండూ!
అలా తీసిపారేయ్యకు నాయనా! స్త్రీలోల తత్వం నీ నడతలో లేకున్నా నీ మొహములో మాత్రం విస్తరించి మరీ కనిపిస్తుంది మరీ! మెరిసిపోయే నిన్ను వీక్షించి ఏ ఆడ చీమైనా మోహించి లాలించి నిన్ను అమాంతం ప్రేమించిపడేస్తుందేమో అని అమ్మాయి భయం, అర్ధం చేస్కోవాలి మరి. నీకు ఇది తప్ప వేరే మార్గం లేదు మరీ!
అతడు: సరే స్వామీ, మీరు చెప్పాక కాదనేదేముంది, ఈ మాటు మీ మాటే నా కర్తవ్యము!
నారద: శుభస్య శీఘ్రం! శీఘ్రమేవ కల్యాణప్రాప్తిరస్తూ! ఇష్టసఖీ ప్రాప్తిరస్తూ! ఐశ్వర్యారోగ్యాభివ్రుద్దిరస్తూ! సఖలవాంచాఫల సిద్దిరస్తూ!
అవునూ, ఇంతకీ మీ పెద్దవాళ్ళ సంగాతేమిటర్రా పిల్లలూ?
అతడు: అది మాత్రమడకకండి స్వామీ! నా వాళ్ళేమో ప్రపంచోద్ధరణోద్యమాలూ అనునిత్యం సంఘసేవలూ అంటూ ములిగిపోయారు. తనవాళ్ళేమో నిన్నో మొన్నో పెళ్ళైనవాళ్ళ మల్లే నీరసంలేని సరసవిరస క్రీడల్లో ములిగిపోయారు. ఇక మాకు మేమూ, ఒకరికి ఒకరం అంతే! తప్పదు.
నారద: వాళ్ళందరి సంగతీ నాకు తెలిసే అడిగానులే!
అతడు: తెలిసినవే అడుగుతారని మీ సంగతీ నాకు తెలిసే చెప్పనులేండీ నేను కుడా!
నారద: బ్రతక నేర్చినవాడివయ్యా నువ్వు! సరేసరే. పెళ్ళిపెద్ద కావాలంటే నేనున్ననుగా! నేను ఏది చేసినా లోకకల్యాణార్ధమేగా! ఇంతకీ పెళ్ళి చేస్కుంటారు సరే, కాపురం ఎక్కడ పెడతారు అని? కన్యాదానమా లేక ఇల్లరికమా? రెండూగాక విడికాపురమా?
అతడు: స్వామీ....................!
నారద: ఏమీ.....................! మళ్ళీ ఏమిటి నాయనా?
అతడు: సర్వజ్ఞానులు మీరు. అన్నీ తెలిసి మీరే ఇలా ఇరుకులో పెట్టడం భావ్యమా స్వామీ? నా పరిస్థితి తెలిసి కుడా మీరిలా.......
నారద: నీ సందేహం సవిదితమే నాయనా, భయపడకు. సంసారానికి సరైన చోటు నేను చూపిస్తా కదా!
అతడు, ఆమె: ఏమిటి స్వామీ అదీ?
నారద: అమ్మయికేమో నీరు బాగా ఉన్నచోటు తప్ప పడదు. నీకేమో ఆ ఊళ్ళు తిరిగే ఉద్యోగం వదిలే అవకాశ౦ ఈ జన్మకు లేదు. అందుకే నీ ఇంటి వెనకాలే కదయ్యా గంగా నది ఉన్నదీ. తీసుకెళ్ళి ఆ ఒడ్డున పెట్టు సంసారాన్ని.
అతడు: ఆహా! అద్భుతమైన దారి చూపించారు స్వామి. మాకు మీకన్నా ఆప్తులింకెవ్వరు స్వామీ. మేము సిద్ధం, మీ చేతుల మీదుగా జరగాల్సినవాటి గురించి మీరు ఆలోచించడం తప్ప!
నారద: తథాస్తూ!

[అదండీ సంగతీ!ఆ రకంగా చంద్రుడికీ కలువకూ కళ్యాణం చేయించాడు లోకకల్యాణాల నారదుడు. అనుమానాలన్నీ తొలగిపోయాయి కలువకి. ఎందుకంటేఇక చంద్రుడు ఇరవైనాలుగు గంటలూ తనతో బాటే కాబట్టీ . బుద్ధిగా ఇంటిపట్టున ఉంటూ తన ఉద్యోగం తను చేస్తూ మరో చోటుకి వెళ్లవలసిన ప్రతీసారి తనతోపాటు భార్యను వెంటపెట్టుకుని వెళ్తూ సుఖిస్తున్నాడు చంద్రుడు. ఇదివరకు తను చెప్పిన మేఘాలు వర్షాలు లాంటి అడ్డంకుల కారణాల అవసరం ఇక ఏనాటికీరాదు కదా. శివుని శిరస్సు పైన గంగ కలువకు అంతః పురమైతే, ఆ శిరస్సు ఇరువురికీ సొంతిల్లు అయ్యింది. ఇలా వీరిద్దరి కథా సుఖాంతమయ్యింది . విఇరి కళ్యాణ౦ కమనీయమయ్యి౦ది. నారాయణ, నారాయణ!]